సాక్షి, అమరావతి: భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్ని చిట్ గ్రూపులను మూసివేసిన నేపథ్యంలో యాజమాన్యం తన చందాదారులను రంగంలోకి దించింది. చిట్ గ్రూపుల మూసివేతను సవాల్ చేస్తూ వారి ద్వారా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేయించింది.
పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కూడా వేర్వేరు. పిటిషన్లు వేర్వేరు అయినప్పటికీ అందులో పేర్కొన్న వివరాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. పేరా నంబర్లు సైతం ఒకటే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా పిటిషనర్ల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన మీనాక్షి అరోరాను రంగంలోకి దించడం గమనార్హం.
ఆమె ఒక్కో కేసుకు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (సుప్రీంకోర్టు వెలుపల వాదించే కేసుల్లో) తీసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలిసింది. అంత పెద్ద మొత్తం తీసుకునే సీనియర్ న్యాయవాదిని నియమించుకునే సామర్థ్యం సాధారణ చందాదారులైన పిటిషనర్లకు ఉంటుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
చిట్ గ్రూపు చందాదారుల తరఫున బుధవారం వాదనలు వినిపించిన మీనాక్షి అరోరా పిటిషనర్ల తరఫున కంటే మార్గదర్శి గురించే ఎక్కువగా వాదించడం విశేషం. మార్గదర్శి చరిత్ర, టర్నోవర్, చందాదారుల వివరాలను నివేదించారు. ఇప్పటివరకు మార్గదర్శిపై చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ నిరంతరాయంగా మార్గదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు.
సీఐడీ కేసులపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందిందని తెలిపారు. చందా తాలుకూ చెక్కు మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా మార్గదర్శి యాజమాన్యం 30 రోజుల తరువాత చెల్లించిందని, ఇంత చిన్న కారణంతో చిట్ గ్రూపును మూసివేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య జోక్యం చేసుకుంటూ చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున నేరుగా హైకోర్టును ఆశ్రయించామని మీనాక్షి అరోరా పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయం ఉన్నా నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. చిట్ గ్రూపుల మూసివేతకు బదులు అధికారులు జరిమానా విధించి వదిలేసి ఉండాల్సిందన్నారు. మీనాక్షి అరోరా వాదనలను ముగించడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment