సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం కీలక పాత్ర పోషించిందనడానికి స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విస్పష్టంగా ప్రకటించింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ అక్టోబరు 9న ఇచ్చిన తీర్పులో ఈ విషయాన్ని అంశాలవారీగా వివరించింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడానికి కారణాలను వివరిస్తూ న్యాయస్థానం ప్రస్తావించిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్కిల్ ప్రాజెక్టుకు సంబంధించి అందుబాటులో ఉన్న రికార్డులు, వివిధ జీవోలు, ఎంవోయూ (ఒప్పందం), నిధుల చెల్లింపు, సీఆర్‌పీసీ 161 వాంగ్మూలాలు, సీఆర్‌పీసీ 164 వాంగ్మూలాలు, నోట్ ఫైళ్లు, జీవోలు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, జీఎస్టీ, ఐటీ అధికారుల దర్యాప్తులో సేకరించిన వివిధ ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నట్టు కూడా కోర్టు వివరించింది.
కేబినెట్‌కు తెలియకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం నుంచి ప్రైవేటు వ్యక్తులకు ఒకటికి మించి పోస్టులు కట్టబెట్టడం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల, షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపు.. ఇలా పలు అక్రమాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కార్యాలయం పాత్రను వివరిస్తూ తన 44 పేజీల తీర్పులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి..
►సీమెన్స్ కంపెనీ, డిజైన్‌టెక్ కంపెనీలతో అప్పటి సీఎం చంద్రబాబు కార్యాలయం ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినట్టు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఆయన చొరవతోనే గంటా సుబ్బారావు (ఏ–1)ను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లోకి తీసుకున్నారని తెలుస్తోంది.
►స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ముందు నుంచే ఆ సంస్థ ఎండీ, సీఈవోగా గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా కె.లక్ష్మీనారాయణలను నియమించాలని అప్పటి సీఎం కార్యాలయం నుంచి కరస్పాండెన్స్ నడిచింది.
►ప్రైవేటు వ్యక్తి అయిన గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవో పోస్టులతో పాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ – ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిర్వహించిన సమావేశాల్లోనే ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ మీటింగ్ మినిట్స్ వెల్లడిస్తున్నాయి.
►కేబినెట్ ఆమోదం లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ – ఇన్నోవేషన్ శాఖలను ఏర్పాటు చేసింది.
►స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీమెన్స్ – డిజైన్ టెక్ కంపెనీలు భరిస్తాయని జీవోలో పేర్కొన్న అంశం ఆ రెండు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం(ఎంవోయూ)లో లేదు. అంతేకాదు.. బ్యాంకు గ్యారెంటీ గురించి కూడా ప్రస్తావించలేదు. ప్రభుత్వం, సీమెన్స్ – డిజైన్‌టెక్ కంపెనీలు సమకూర్చాల్సిన నిధుల వాటా గురించి ప్రస్తావించకుండానే ఒప్పందం కుదర్చుకున్నారు. ఆ ఒప్పందం ఫైల్‌ను అప్పటి సీఎం చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఆయన కార్యాలయమే ఆ ఫైల్‌ను ఆమోదించింది.
►సీమెన్స్ – డిజైన్‌టెక్ కంపెనీల వాటా 90 శాతం నిధులను సమకూర్చనందున ప్రభుత్వం వాటా 10 శాతం నిధులను విడుదల చేయడంపై
ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన వాటాæ 10 శాతం నిధులను డిజైన్‌టెక్ కంపెనీకి చెల్లించింది. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ, అప్పటి సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశాల్లోనే ఈ నిధులు చెల్లించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని నోట్‌ఫైళ్లు స్పష్టం చేస్తున్నాయి.
►డిజైన్‌టెక్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించిన నిధుల్లో రూ.241 కోట్లను బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి షెల్ కంపెనీల ద్వారా మళ్లించారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. డిజైన్‌టెక్ కంపెనీ సమర్పించిన ఇన్వాయిస్‌లలో పేర్కొన్న మొత్తానికి, ప్రాజెక్టు అసలు వ్యయానికి మధ్య పొంతన లేదు.
►ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టులో భాగస్వాములైన సీమెన్స్ – డిజైన్‌టెక్ కంపెనీలకు చెల్లించిన నిధుల దుర్వినియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment