చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం | TDP Leaders Attack Mangalagiri Man, Shocking Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

Published Mon, Jun 10 2024 7:36 AM | Last Updated on Mon, Jun 10 2024 11:40 AM

TDP Leaders Attack Mangalagiri Man

అమరావతి, సాక్షి:  నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులతో సహా ఎవరినీ వదలకుండా.. దాడులు కొనసాగిస్తున్నాయి. 

తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్‌ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. 

‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్‌.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్‌ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్‌ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. 

పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. 

ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్‌ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్‌ చేస్తూ.. దాడిని సమర్థిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement