అధికారుల నిర్లక్ష్యంతోనే ఇసుక గొడవ
ప్రొద్దుటూరు : అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామం వద్ద టీడీపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులకు దారి తీసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గురివిరెడ్డి ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఈయన అక్రమ రవాణా దందా కొనసాగిస్తున్నారు. ప్రొద్దుటూరుకు ఇసుకను తరలించి అమ్మడం రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా గ్రామానికి అలా వెళ్లి ఇలా మొక్కుబడిగా తిరిగి రావడం పరిపాటిగా మారింది. ఇది ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయుడు గురివిరెడ్డి పెన్నానదిలో చెక్ పోస్టు తరహాలో గేట్ ఏర్పాటు చేశాడు. బండికి, ట్రాక్టర్‌కు ఇసుక తీసుకెళ్లాలంటే ధర నిర్ణయించి.. ఆ మొత్తం చెల్లిస్తేనే బండి లేదా ట్రాక్టర్‌ను పెన్నానదిలోకి అనుమతిస్తానని ఖరాఖండిగా చెబుతున్నారు. బుధవారం గ్రామంలోని టీడీపీ వర్గీయులే పరస్పర వాగ్వాదానికి దిగడంతో విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దారు గంగిరెడ్డి భాస్కర్‌రెడ్డి జీపును అడ్డుకుని ‘నా జోలికి వస్తే నీ జీపు కాలుస్తా’ అని గురివిరెడ్డి హెచ్చరించిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పోలీసులు, అధికారుల్లోనూ.. ఆయన ఆగడాలను అడ్డుకునేవారే లేకుండాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment