స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం
రాయచోటి: స్వేచ్ఛ ను హరించడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. లోపాలను ఎత్తిచూపడం, ఎన్నికల హామీలు అడగడం ప్రతిపక్ష పార్టీల హక్కు అన్నారు. ఆ హక్కును వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా చేస్తుంటే భయభ్రాంతులకు గురిచేసి వ్యక్తిగతంగా బెదిరించడం, కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపైన, నియోజకవర్గ నేతలపైనా కుట్రపూరితంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అవి కనబడలేదా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిశీలించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులపై పునరాలోచించాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.
హనుమంతరెడ్డిని విడుదల చేయాలి
గాలివీడు మండలం అరవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త కె. హనుమంతరెడ్డిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తెల్లవారుజామున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు సమాచారం తెలియకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా యోధులకు ఎల్లవేళలా తాము అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment