మదనపల్లె: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు కార్యాలయ పనివేళల ప్రారంభ సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు రికార్డ్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. లోనికి సిబ్బందిని అనుమతించకుండా వారే స్వయంగా కావాల్సిన రికార్డులు తీసుకుని పరిశీలించినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాద ఘటన దర్యాప్తును ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు సీఐడీ అధికారులు సబ్ కలెక్టరేట్, మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీఓ నంబర్.596 ఆధారంగా నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు, వాటికి సంబంధించిన రికార్డులు, ఈసీలను సీఐడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. రిజి స్ట్రేషన్ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లు, ఎన్‌ఓసీ, ఫ్రీహోల్డ్ వెరిఫికేషన్ తదితర అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించారని తెలిసింది. సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాద ఘటన జరిగి 106 రోజులు కావస్తున్నా అడపాదడపా సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు, పరిశీలనలు తప్ప ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment