No Headline
గాలివీడు : జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి గుర్తింపు కార్డు జారీకి కేంద్రం ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)ను ప్రారంభించింది. వన్ నేషన్ – వన్ స్టూడెంట్ ఐడెంటిటీ పేరుతో విదార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐడీ పొందడానికి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అపార్ నమోదుకు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తప్పులు లేని ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. ఇక్కడే చిక్కంతా వస్తోంది. ప్రతీ విద్యార్థికి పాఠశాలలో నమోదైన వివరాలు, ఆధార్లో ఉన్న వివరాలు ఒకేలా ఉండాలి. 70 శాతం మంది పిల్లలకు పాఠశాల రికార్డుల్లోని సమాచారానికి.. ఆధార్‌లోని వివరాలకు సరిపోలడం లేదు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. దీంతో ఆయా పత్రాలు పొందడానికి.. ఆధార్‌లో తప్పులు సవరించుకోవడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాలు, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటి నుంచి డిగ్రీ వరకు చదువు తున్న విద్యార్థులకు అపార్ నమోదు జరుగుతోంది.
ఈ కార్డుల జారీ బాధ్యతలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం అప్పజెప్పింది. ఈనెల 30లోగా ప్రక్రియను పూర్తి చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాల రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం ఆధార్లో సవరణ చేసుకోవడానికి యూఐడీ వారు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేశారు. విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రం కావాలంటే తొలుత పంచాయతీ కార్యాలయంలో నాన్– ట్రేస్ట్ సర్టిఫికెట్ తీసుకుని మీ సేవా లేదా సచివాలయాల్లో తగిన ధ్రువపత్రాలతో తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్డీఓకు నివేదిస్తారు. ఆర్డీఓ పరిశీలన అనంతరం పుట్టిన తేదీ ధ్రువపత్రం జారీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి 20 రోజుల నుంచి 30 రోజులు పడుతోంది. అపార్‌లో నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండడంతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నా రు. పాఠశాలల రికార్డుల్లోని వివరాల ప్రకారం విద్యార్థుల ఆధార్ కార్డులో వివరాలు మార్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆధార్ సవరణ బాధ్యత హెచ్‌ఎంలకు అప్ప గిస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. దీనికోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే అపార్ నమోదు మరింత వేగవంతం అవుతుంది. ఈ దిశగా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అపార్‌తో ప్రయోజనం
అపార్ కార్డు విద్యార్థులకు ఎంతో కీలకం కానుంది. ఇందులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం పొందుపర్చనున్నారు. 12 అంకెలతో కూడిన జీవిత కాల ఐడీ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా విద్యార్థులు అకడమిక్ రికార్డులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా పొందవచ్చును. విద్యార్థుల విద్యా ప్రమాణం, విజయాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు ట్రాక్ చేస్తుంది. అలాగే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు బదిలీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.
తప్పుల తడకగా విద్యార్థుల ఆధార్ వివరాలు
‘జనన ధ్రువీకరణ పత్రం ఉంటేనే సవరణలు‘
విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పని అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment