నడిపించే నాయకుడెవరు?
రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటకు నాయకుడెవరో తెలియని.. చెప్పలేని స్థితిలో అధికారపార్టీ నిలిచింది. తమ నాయకుడెవరో.. అసలు ఈ పార్లమెంట్ పరిధిలో ఇన్‌చార్జి ఎవరో దిక్కు తెలియనిస్థితిలో క్యాడర్ కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా పార్టీ క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది. నేనే ఇన్‌చార్జ్ అని ఒకరు..తనదే జరగాలంటూ ఇంకొకరు..లేదులేదు తానే త్వరలో ఇన్‌చార్జినవుతా అని మరొకరు ఇలా ఎవరిమటుకు వారు అధికారంతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. తమకొకనేత కావాలంటూ..
రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మూడుముక్కలాటగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓటమిపాలైన సుగవాసి బాలస్రుబ్రమణ్యం, రాజంపేట పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు ప్రస్తుతం ఇన్‌చార్జి పదవి రేసులో కొనసాగుతున్నారు. ఇక ఎన్నికల ముందు రాజంపేట ఇన్‌చార్జ్‌గా ఉన్న బత్యాల చెంగల్రాయులు పార్టీలో ఉన్నా ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నారు. దీంతో అసలు ఇక్కడ నాయకుడెవరో.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక తమకొకనేత కావాలంటూ పార్టీ క్యాడర్ బహిరంగంగానే డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారపార్టీ నియోజకవర్గ నేతలతో సంబంధం లేకుండానే కొంతమంది పార్టీ క్యాడర్ కలిసి సమావేశం నిర్వహించుకోవడం గమనార్హం. కాగా ఓడిపోయిన అభ్యర్థే ఇన్‌చార్జి అనే నిబంధన తనకు వర్తిస్తుందని సుగవాసి అధికారులతో చెప్పుకుంటూ సమావేశాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ముందు రాజంపేట ఇన్‌చార్జిగా ఉన్న బత్యాల చెంగల్రాయుడు అటు రైల్వేకోడూరు.. ఇటు రాజంపేటకు అప్పుడప్పుడూ క్యాడర్‌తో తరచూ కలుస్తున్నారు. ఈయన పెత్తనం దాదాపు రాజంపేటలో తగ్గిపోయిందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే నందలూరుకు చెందిన మేడా విజయశేఖర్‌రెడ్డి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
బాబు, లోకేష్‌తో డైరక్ట్ కనెక్షన్ ఉందంటూ..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌తో తమకు డైరక్ట్‌గా కనెక్షన్ ఉందని, ఏ పని అయినా చేసి పెడతామని కొంతమంది పచ్చ నేతలు దళారి అవతారం ఎత్తినట్లు సమాచారం. బదిలీలు, నామినేటెడ్ పోస్టులతోపాటు తమ తమ సమస్యలు, ల్యాండ్ లిటికేషన్, అవుట్‌సోర్స్‌పోస్టులు తదితర వాటికి సందేట్లో సడేమియా లక్షలాదిరూపాయిలు వసూలు చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో నే చర్చలు సాగుతున్నాయి. ప్రతినేతా మంత్రులుతోపాటు ఫొటోలు దిగడం, తమ పలుకుబడని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆకర్షితులైనవారికి తాము ఏ పనైనా చేసిపెడతామంటూ కాసులను దండుకోవడం ఇప్పుడు రాజంపేటలో హాట్‌టాపిక్. ఇన్‌చార్జి ఎవరు లేరు..ఇన్‌చార్జితో అవసరం లేదంటూ పచ్చదళారులు జేబులు నింపుకుంటుండడం గమనార్హం.
రాజంపేట టు అమరావతికి చక్కర్లు..
అధికారపార్టీకి చెందిన నేతలు ఇప్పుడు అధికంగా అమరావతిలో కనిపిస్తున్నారు. రాజంపేట టు అమరావతి అన్నట్లుగా కొంతమంది నేతలు పైరవీలు చేసుకుంటున్నారు. సహజంగా అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు ఉంటేనే ఏ మంత్రి, ఉన్నతాధికారి అయినా కావాల్సిన పని చేసి పెట్టడం కనిపిస్తుంది. ఇక్కడ అధికారపార్టీకి ఎమ్మెల్యే లేనందున, ఇన్‌చార్జి సిఫార్సులకు పని జరుగుతుంది. ఇప్పుడు ఆ ఇన్‌చార్జి ఎవరో తెలియని దుస్థితిలో ఎవరి నెట్‌వర్క్‌లో వారు పనిచేసుకుంటున్నారు.
చెప్పండి బాబూ..
తమకోనేత కావాలంటున్న
‘రాజంపేట’ టీడీపీ క్యాడర్
తెరపైకి పచ్చ దళారులు..
Comments
Please login to add a commentAdd a comment