పల్లకిలో ఊరేగిన భద్రకాళీ సమేతుడు
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి అత్యంత భక్తిశ్రద్ధలతో పల్లకి సేవ చేశారు. సోమవారం రాత్రి మూలవిరాట్‌లకు పూజలు, అభిషేకాలు నిర్వహించి అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకాలు, పూజలు జరి పి పల్లకిలో ఊరేగించారు. ఈ పల్లకి సేవలో స్థానిక భక్తులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.
పోస్టర్ల ఆవిష్కరణ
రాయచోటి : జిల్లాలోని పశువులకు వందశాతం బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ పశుసంవర్థకశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ హాలులో బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ వ్యాధికి చికిత్స లేదని నివారణకు టీకాలు ఒకటే మార్గమని కలెక్టర్ సూచించారు. 4 నుంచి 8 నెలల గల పేయ దూడలకు తప్పనిసరిగా టీకా వేయించాలన్నారు. డీఆర్‌ఓ మధుసూదన్ రావు, ఎస్డీసీ రామసుబ్బయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి గుణ శేఖర్ పిళ్లై, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
టైలరింగ్,బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : కెనరా బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి టైలరింగ్, బ్యూటీ పార్లర్‌లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులని ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం స్థానికంగానే కల్పిస్తారన్నారు. మరిన్న వివరాలకు ఫోన్ నంబర్లు : 94409 05478, 99856 06866, 94409 33028 లలో సంప్రదించాలని వివరించారు.
వైఎస్సార్ జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్ : జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. పెండ్లిమర్రిలో అత్యధికంగా 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాజుపాళెంలో 10.8, పెండ్లిమర్రి 19.2, చింతకొమ్మదిన్నె 9.6, ఒంటిమిట్ట 8.4, కడప 8, ప్రొద్దుటూరు 4.2, దువ్వూరు 2.8, చెన్నూరు 1.6, ముద్దనూరులో 1.2 మి.మీ వర్షం పడింది.
108 సిబ్బంది నిరాహార దీక్ష
కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా 108 సర్వీసు ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వారికి సీఐటీయూ నాయకులు బి.మనోహర్, వెంకట సుబ్బయ్య, చంద్రారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు దఫాలుగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు.. సమస్యలు పరిష్కరించకపోవడంతో రిలే దీక్షలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రోజుకు మూడు షిఫ్ట్‌లలో ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలన్నారు. 108లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వేయిటేజీ మార్కులు ఇవ్వాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఈఎంటీ పోస్టుల నియామకాల్లో 108లో పని చేస్తున్న ఈఎంటీలను నియమించాలన్నారు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించకపోతే ఈనెల 25 నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు.
రేపు డయల్ యువర్ ఆర్‌ఎం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కార నిమిత్తం డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సమస్య లు, సూచనలు, సలహాలను 995922 5848 నంబరుకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment