టీడీపీ నిర్వాకం.. మిల్లుల నిర్వాహకులకు శాపం
● పల్వరైజింగ్ మిల్లులపై ప్రభుత్వం చిన్నచూపు
● మూతపడ్డ వందలాది మిల్లులు
● వీధినపడ్డ వేలాది మంది కార్మికులు
● ఖనిజ సరఫరాలో కోత...యజమానుల వేదన
ఓబులవారిపల్లె: మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి వెలికి తీసిన బైరెటీస్ ఖనిజం ఆధారంగా రైల్వే కోడూరు నియోజవర్గం పరిధిలో దాదాపు 250 పల్వరైజింగ్ మిల్లులు, చిన్నపరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పల్వరైజింగ్ మిల్లులపై టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మిల్లులకు ఖనిజ సరఫరా లో కోత కోసి వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఫలితంగా మిల్లుల మనుగడ ప్రశార్థకంగా మారింది. ఇప్పటికే వందలాది మిల్లులు మూతపడ్డాయి.
మహానేత చొరవతో..
మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంగంపేట పరిసరాలలో చిన్నపరిశ్రమలైన పల్వరైజింగ్ మిల్లుల అభివృద్ధి కోసం జీఓ నెంబర్ 296ను ప్రవేశపెట్టారు. స్థానికంగా ఏర్పాటు చేసుకొన్న మిల్లులకు రాయితీలు కల్పించారు. దీంతో మిల్లుల యజమానులు బైరెటీస్ ఖనిజాన్ని స్థానికంగా పొడి చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తుండేవారు. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి దొరికింది. 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఫల్వరైజింగ్ మిల్లులపై కక్షసాధింపు చర్యలకు దిగారు. వైఎస్సార్ తీసుకొచ్చిన 296 జీఓను రద్దు చేసి మిల్లుల రాయితీలను తొలగించారు. అంతే కాకుండా మిల్లులకు ఖనిజ సరఫరా నిలిపివేశారు.
ఇప్పుడూ అంతే... ఖనిజ సరఫరాలో కోతే..
టీడీపీ ప్రభుత్వం వస్తే చాలు పల్వరైజింగ్ మిల్లులకు గండం వచ్చినట్లే అని పలువురు మిల్లుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానికంగా ఉన్న మిల్లులకు ప్రతి నెలా ఏ గ్రేడ్ ఖనిజం 400 టన్నులు, బి గ్రేడ్ ఖనిజం 900 టన్నులు ఏపీఎండీసీ ద్వారా సరఫరా అయ్యేది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పల్వరైజింగ్ మిల్లులకు సరఫరా అయ్యే బైరెటీస్ ఖనిజంలో భారీగా కోత వేసింది. ప్రతి నెలా ఏ గ్రేడ్ 110 టన్నులు, బి గ్రేడ్ 200 టన్నులు ఇవ్వాలని నిర్ణయించింది. బైరైటీస్ ఖనిజాన్ని పౌడర్ చేసేందుకు నిర్మించుకున్న పల్వరైజింగ్ మిల్లులకు ఖనిజ సరఫరా చేయలేనప్పుడు అనుమతులు ఎందుకు ఇచ్చారని మిల్లు యజమా నులు ప్రశ్నిస్తున్నారు. ఎగుమతిదారులతో కుమ్మక్కై స్థానికంగా ఉన్న చిన్నపరిశ్రమలపై ఉక్కుపాదం మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముడి ఖనిజం ఎగుమతులు నిలిపివేయాలి
గల్ఫ్ దేశాలలో పెట్రోలు బావుల్లో పెట్రోలు వెలికి తీసేందుకు బైరెటీస్ ఖనిజం పొడిని వినియోగిస్తారు. ఫలితంగా అక్కడి నుంచి అధిక సంఖ్యలో మిల్లులకు ఆర్డర్‌లు వచ్చేవి. దీంతో ఇక్కడి పల్వరైజింగ్ మిల్లుల యజమానులు బైరెటీస్ ఖనిజం పొడిని అక్కడికి సరఫరా చేసి జీవనోపాధి పొందుతూ వస్తున్నారు. ప్రస్తుతం ముడి ఖనిజాన్ని పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. దీంతోపాటు అక్కడి పల్వరైజింగ్ మిల్లులు పొడి చేసి విక్రయిస్తుండడంతో స్థానికంగా ఉన్న మిల్లులకు ఆర్డర్‌లు లేక, వ్యాపారం పూర్తిగా దెబ్బతింటున్నాయి. పైగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఎగుమతి దారులకు ఖనిజాన్ని ఏపీఎండీసీ అధికారులు సరఫరా చేస్తున్నారు. దీంతో స్థానికంగా మిల్లు యాజమనులు, లారీ యజమానులు ము డిఖనిజం సరఫరా నిలివేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment