మదనపల్లె: విద్యానగరిగా పేరొందిన మదనపల్లెలో మరో విద్యాలయం ఏర్పాటుకానుంది. స్థానిక ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషితో మదనపల్లెకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏప్రిల్‌లో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. మంగళవారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్)కు చెందిన తనిఖీ బృందం మదనపల్లెలో తుది పరిశీలనకు వచ్చింది. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌తో కలిసి మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయానికి, నేషనల్ హైవేకు ఆనుకుని వివిధ సర్వేనెంబర్లలో కేటాయించిన 6.09 ఎకరాల స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తాత్కాలికంగా నిర్మించిన తరగతి గదులను, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు, బోధనా సిబ్బందికి చేయాల్సి న ఏర్పాట్లపై రెవెన్యూ అధికారులకు పలు సూచనలిచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి టాయిలెట్స్‌కు అదనంగా మరికొన్ని నిర్మించాలన్నారు. స్టాఫ్‌కు సంబంధించి ఆఫీసు గది ఏర్పాటు, పిల్లలకు గ్రౌండ్, నీటివసతి తదితరాలపై ఆరా తీశారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ సంఘటన్, కడప ప్రిన్సిపాల్ మునేష్‌మీనా మాట్లాడుతూ... మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లకు సంబంధించి తుది పరిశీలనకు వచ్చామన్నారు. కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన స్థలం, తాత్కాలిక తరగతి గదులు అనుకూలంగా ఉన్నాయని, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో తాము గమనించిన అంశాలపై నివేదిక పంపుతామని, ఏప్రిల్‌లో 1 నుంచి 5వ తరగతి వరకు, ఒక్కో తరగతికి 40 మంది విద్యార్థుల చొప్పున క్లాసులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ...ఏప్రిల్ నుంచి తాత్కాలిక భవనంలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభమవుతాయని, మూడేళ్లలోపు వలసపల్లెలో పూర్తిస్థాయిలో భవన నిర్మాణం జరిగాక అక్కడకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ టీచర్ విజయకుమార్‌రెడ్డి, తహసీల్దార్ ఖాజాబీ, సర్వేయర్ రెడ్డిశేఖర్, గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కృషి ఎనలేనిది. మదనపల్లెను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఆయన బీటీ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడంతో పాటుగా బీటీ యూనివర్శిటీ ఏర్పాటుకు జీఓ విడుదల చేయించారు. అలాగే రాజంపేట పార్లమెంటరీకి మంజూరైన మెడికల్ కళాశాలను ఆరోగ్యవరం సమీపంలో 95 ఎకరాల సువిశాల స్థలంలో రూ.495 కోట్లతో ఏర్పాటయ్యేందుకు చొరవచూపారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి పలుమార్లు కేంద్రమంత్రులను కలిసి కల సాకారమయ్యేలా కృషిచేశారు. రానున్న విద్యాసంవత్సరానికి కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంపై పట్టణవాసులు ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment