డిసెంబర్ 31 నాటికి గృహాలు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద మంజూరైన గృహాలు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరం నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై ద్వారా హౌసింగ్ లేఅవుట్స్‌లో సొంత స్థలాల్లో మంజూరైన ఇళ్ల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమీక్షించాలన్నారు. రూఫ్ లెవెల్‌లో ఉన్న ఇళ్లు పూర్తయ్యేలా, స్టేజ్ అప్డేషన్ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. గృహాలపై సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యార్థులకు అపార్ ఐడీలను త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. పల్లె పండుగలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లు, సైడు కాలువల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ప్రసాద్, సీపీఓ శేషశ్రీ, డ్వామా పీడీ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి జిల్లాస్థాయి జీపీడీపీ శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో 2025–26 వార్షిక ప్రణాళిక రూపకల్పనపై జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులతోపాటు పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై శిక్షణ నిర్వహిస్తున్నట్టు జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025–26లో భాగంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అభివృద్ధి, జిల్లా పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్ అభివృద్ధి ప్రణాళికలపై సమగ్ర కార్యాచరణ తయారీకి ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈనెల 5,6వ తేదీల్లో పల్నాడు, 7,8వ తేదీల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని మండలాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు అధికారులు, ఉద్యోగులు హాజరు కావాలని సూచించారు.
40,989 బస్తాల మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 40,989 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 35,381 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 18,300 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 8,500 నుంచి రూ. 17,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 8,000 నుంచి రూ. 17,800 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 23,765 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
ఆర్టీసీలో అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటీస్ చేసేందుకు ఐటీఐ అభ్యర్థులు ఽఈనెల 6వ తేదీ నుంచి 20వ తేదీలోగా ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ వి.నీలిమ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్‌టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులన్నారు. వీరందరూ జిల్లాల వారీగా www. aprenticerhipindia.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మార్కులు, సీనియార్టీ ప్రకారం ఎంపికలు జరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment