స్టార్టప్‌లకు మరింత ప్రోత్సాహం
● నూతన ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి ● కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
తాడికొండ : సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వికసిత్ భారత్ కింద దేశంలో స్టార్టప్‌లకు గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమరావతిలోని విట్ (వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన వికాస్ – 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పెమ్మసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో అతి తక్కువ సంఖ్యలో స్టార్టప్‌లు ఉండేవని, ప్రస్తుతం 1.12 లక్షల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయన్నారు. గతంలో యూనికార్న్‌లు నాలుగు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 1,100కు అవి చేరాయని వివరించారు. ఇండియాలో సుస్థిరమైన ప్రగతి కోసం వికసిత్ భారత్, వికాస్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. తాను నిర్వహిస్తున్న కమ్యూనికేషన్స్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలతోనే దేశం పదేళ్లలో ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఎంసెట్‌లో తాను 27వ ర్యాంక్ సాధించానని, తనకంటే 26 మంది ముందున్నా, ఆలోచనలు విస్తృతం చేయడం ద్వారా సక్సెస్ సాధించానన్నారు. ఇది యువతకు ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించిన మంత్రి పెమ్మసాని.. వర్సిటీ విద్యార్థులతో కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment