గ్రామీణులకు ఉపయోగపడేలా ప్రణాళికలు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) రూపకల్పనపై గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని అధికారులు, సిబ్బందికి రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ.. దేశంలో 70 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివశిస్తున్నారని తెలిపారు. గ్రామాల నుంచి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని చాలామంది ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారని అన్నారు. గ్రామాలను అభివృద్ధి పర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పంచాయతీ వనరుల కేంద్ర జిల్లా సమన్వయకర్త షీలా పద్మారాణి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. జనవరి నెలలో గ్రామస్థాయి, ఫిబ్రవరిలో మండల స్థాయి, మార్చి నెలలో జిల్లాస్థాయిలో ప్రణాళికల ద్వారా నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీపీవో నాగసాయికుమార్, జేడీ ఆర్. కేశవరెడ్డి, జెడ్పీ సీఈవో బి. జ్యోతిబసు, డాక్టర్ మోహన్, కె. జియాబేగం, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా
Comments
Please login to add a commentAdd a comment