వీఆర్‌ఏల ముందస్తు అరెస్టు, నిర్బంధాలు అక్రమం
నరసరావుపేట: తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా రాష్ట్రవ్యాప్త నిరసన చేపట్టాలని భావించిన గ్రామ రెవెన్యూ సహాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహనిర్బంధానికి గురిచేయటం అక్రమమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులు ఎస్.ఆంజనేయులు నాయక్ ప్రకటించారు. తాము ప్రజాస్వామ్యయుతంగా పాలిస్తామని కూటమి సర్కారు ప్రకటించిందని, నేడు దానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. వీఆర్‌ఏల ఏ ఒక్క సమస్యనూ సర్కారు వచ్చాక పరిష్కరించలేదని తెలిపారు. వారి సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా గతంలో లేని విధానంలో ఆఫీసులలో నైట్ డ్యూటీలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక రీచ్‌ల వద్ద కాపలాదారులుగా పెట్టారన్నారు. ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా ఇతర పనులను అదనంగా చేయిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు, రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా అతీగతీ లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ 18వ తేదీన రాష్ట్రవ్యాప్త శాంతియుత నిరసనకు పూనుకున్నామని పేర్కొన్నారు. అణచివేత చర్యలకు పూనుకోవడం ద్వారా ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని చాటుకుందని తెలిపారు. దీనివల్ల ఉద్యమాలు నిలిచిపోవని స్పష్టం చేశారు. వీఆర్‌ఏల సంఘం నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment