‘తీర’నాళ్ల
బాపట్లటౌన్: కార్తిక పౌర్ణమి తర్వాత వచ్చిన ఆదివారం కావడంతో సూర్యలంక తీరం భక్తులతో పోటెత్తింది. సుమారు లక్ష మందికిపైగా సందర్శకులు తరలివచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తీరం తిరనాళ్లను తలపించింది. వన సమారాధనలతో కళకళలాడింది. తెల్లవారుజామునే భక్తులు, పర్యాటకులు సూర్యలంక తీరానికి చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. కెరటాలపై కేరింతలు కొట్టారు. సూర్యనమస్కారాలు, పుణ్యస్నానాలతో భక్తిప్రపత్తులు చాటుకున్నారు. జిల్లాతోపాటు కృష్ణా, ప్రకాశం, హైదరాబాద్ నుంచి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. మహిళలు తీరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమ, శివలింగాలను తయారుచేసి వాటి ముందు ముగ్గులేసి ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి పసుపు, కుంకుమలతో అలంకరించారు. పూజలనంతరం గౌరీదేవి ప్రతిమలతోపాటు గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లు సముద్రంలో కలిపారు. సూర్యంలక సముద్రతీరానికి సమీపంలోని జీడిమామిడి తోటలు, ఇసుక తిన్నెలు వనభోజనాల సందడితో కళకళలాడాయి.
పోలీసులు సతమతం
కార్తిక పౌర్ణమికి అధిక రద్దీ ఉంటుందని భావించిన పోలీసులు ఆ రోజున 350 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే ఆ రోజు వాయుగుండం ప్రభావంతో సందర్శకులు రాలేదు. ఆదివారం తీరంలో బందోబస్తుకు వంద మందిని మాత్రమే కేటాయించారు. పౌర్ణమి తర్వాత వచ్చిన ఆదివారం, సెలవు రోజు కావడంతో పొరుగు జిల్లాల నుంచీ భక్తులు భారీగా తరలిరావడంతో బందోబస్తు పోలీసులకు కష్టతరంగా మారింది. పర్యాటకులు సముద్రం లోపలకు వెళ్లడాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం, కట్టుదిట్ట భద్రతా చర్యలకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. బాపట్ల రూరల్ సీఐ జి.గంగాధర్ ఉన్న సిబ్బందితోనే ప్రణాళికాబద్ధంగా బందోబస్తును నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
జనసంద్రం
పోటెత్తిన సూర్యలంక తీరం లక్షమందికిపైగా భక్తులు, పర్యాటకులు కలిసొచ్చిన ఆదివారం వన సమారాధనలతో కళకళ
Comments
Please login to add a commentAdd a comment