సమన్యాయం హుష్ ఖాకీ
కిందిస్థాయి సిబ్బందే బలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు చేసిన కేసులో పోలీసు ఉన్నతాధికారులు సమన్యాయం మరిచారు. కిందిస్థాయి సిబ్బందిని బలిచేశారు. అనిల్‌తో అరండల్‌పేట స్టేషన్ సీఐగా పనిచేసిన కె.శ్రీనివాసరావుకు తొలి నుంచి స్నేహసంబంధాలు ఉన్నట్టు విమర్శలు ఉన్నాయి. అందుకే ఆయన అనిల్‌ను నిందితుడిలా కాకుండా సాధారణ వ్యక్తిలా చూశారని, ఆయన ఆదేశాల మేరకే సిబ్బంది రాచమర్యాదలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సీఐను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్టయిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. సీఐకి కుడిభుజంగా వ్యవహరిస్తూ అనిల్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐడీపార్టీ కానిస్టేబుల్‌ను, స్టేషన్‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.
ఐడీ పార్టీ కానిస్టేబుల్ హస్తం!
సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన కేసులో శేషు కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులకు మరో విషయం తెలిసింది. సీఐ శ్రీనివాసరావుకు కుడిభుజంగా ఉండే ఓ ఐడీ పార్టీ కానిస్టేబుల్, ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ హస్తం కూడా ఉందని గుర్తించారు. ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ను ఇటీవల జిల్లా ఉన్నతాధికారి వేరే స్టేషన్‌కు బదిలీ చేసినా సీఐతో ఉన్న సత్సంబంధాలతో అతను గుంటూరులోనే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సెటిల్‌మెంట్లతోపాటు వ్యాపార సంస్థలు, బార్‌ల నుంచి డబ్బులు వసూలు చేసి సీఐకి ఇస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి. ఐడీపార్టీ కానిస్టేబుల్‌తోపాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ బోరుగడ్డ వ్యవహారంలో సీఐ పట్ల, మరో సబ్ డివిజన్ అధికారి పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు పోలీసు విచారణలో తేలడంతో ఉన్నతాధికారులు వారిని పిలిచి మందలించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో సీఐ, అతనికి కొమ్ముకాసిన వారిని నామమాత్రపు చర్యలతో వదిలేసి ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్ట్ అయి రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న వారిని సస్పెండ్ చేయడంతో ఉన్నతాధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
సీఐకి వీఆర్‌తో సరి! సీఐ కుడిభుజం ఐడీ పార్టీ కానిస్టేబుల్‌పైనా చర్యల్లేవు ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్టయిన నలుగురు సిబ్బంది సస్పెన్షన్ బోరుగడ్డ అనిల్ కేసులో ఉన్నతాధికారుల వింత పోకడ
సీసీ కెమెరాల టెక్నీషియన్ శేషు బ్లాక్‌మెయిలరే !
అనిల్ వీడియో బయటకు వచ్చిన వ్యవహారంలో అరెస్టయిన శేషుపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు అరండల్‌పేటకు చెందిన శేషు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ఓ సంస్థలో టెక్నీషియన్. సంస్థకు వచ్చే ఆర్డర్ల మేరకు ఇళ్లు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలు, ఫాంహౌస్‌లలో సీసీ కెమెరాలు బిగిస్తుంటాడు. అవి బిగించిన తర్వాత వాటి యాక్సెస్ పొంది యజమానులకు తెలియకుండా సీసీ ఫుటేజీల్లో రికార్డయ్యే దృశ్యాలను రహస్యంగా చూస్తుండేవాడని సమాచారం. ఈ ఫుటేజీలను అడ్డం పెట్టుకొని పలువురిని అతడు బెదిరించిన ఘటనలూ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ రిటైర్డ్ ఆర్‌ఎస్‌ఐ ఫాం హౌస్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన శేషు వాటి ఫుటేజ్‌లు రహస్యంగా చూశాడని పోలీసులు గుర్తించారు. మరో 11 చోట్ల సీసీ కెమెరాల యాక్సెస్ పొంది, ఆ దృశ్యాలనూ శేషు తన మొబైల్‌లో చూస్తున్నట్లు తెలుసుకున్నారు. శేషు ఓ టీవీ చానల్ కెమెరామెన్ వంశీ, ఓ పత్రికా విలేకరి అరుణ్‌తో కలిసి పలువురు బాధితులను బెదిరించినట్టు సమాచారం. దీంతో పోలీసులు ఈ ముగ్గురిపై రెండు కేసులు నమోదు చేశారు. శేషును మాత్రమే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరుణ్ పరారీలో ఉండగా వంశీ మాత్రం అధికారి పార్టీ నేతల అండతో స్టేషన్ బెయిల్ పొందాడు. పోలీసు విచారణలో పోలీస్ స్టేషన్ వీడియో తన వల్లే బయటకు వచ్చినట్టు శేషు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ఈ సీసీ ఫుటేజ్‌లను శేషు స్నేహితులూ చూసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment