రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృత్యువాత
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మాచవరం: మండలంలోని తురకపాలెం గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న దుర్ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి (25), దరియా వలి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి మాచవరం వెళుతున్నారు. మాచవరం నుంచి వేమవరం వైపు వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. ఘటనా స్థలంలోనే మస్తాన్ వలి మృతి చెందాడు. దరియావలికి, మరో బైకుపై వచ్చిన పిన్నెల్లి గ్రామానికి చెందిన శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108లో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సతీష్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాలువలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతు
మాచర్ల రూరల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పట్టణ శివారులోని నాగార్జునసాగర్ కుడి కాలువలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలో ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఏలూరు జిల్లాకి చెందిన విద్యార్థి కొడమంచిలి మౌనిష్ కుమార్ (18) ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి పట్టణ శివారులో ఉన్న నాగార్జునసాగర్ కుడి కాలవలో ఈతకు వెళ్లాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
డీఎస్సీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన
తెనాలి: బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత గుంటూరు బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రారంభించిన డీఎస్సీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఒక ప్రకటనలో సూచించారు. సంఘం తరఫున 26 జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో అన్ని రకాల ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణను ఇవ్వాలని, రాజధాని అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని కోరినట్టు గుర్తుచేశారు. తమ విజ్ఞాపన మేరకు తొలిగా 100 మందికి సివిల్స్ కోచింగ్ ఇస్తామని మంత్రి హామీనివ్వటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి జిల్లా నుంచి 250 మంది చొప్పున 5,720 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు 60 రోజుల పాటు డీఎస్సీ శిక్షణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పేద, బడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత సక్రమంగా వినియోగించుకొని, తమ కలల్ని సాకారం చేసుకోవాలని శంకరరావు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment