లక్ష్మీపురం: రాష్ట్రంలోని సివిల్ సప్లయిస్ కార్మికుల కూలి రేట్ల జీఓని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయి సమ్మెలోకి వెళ్లటానికి కార్మికులు సన్నద్ధమవుతున్నారని రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హమాలీ(ముఠా)వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చిన్న ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక గుంటూరు (కలెక్టర్ కార్యాలయం వద్ద) జిల్లా సివిల్ సప్లయిస్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఆంజనేయులు మాట్లాడుతూ అగ్రిమెంట్ కాల పరిమితి ముగిసి 11 నెలలు పూర్తి అవుతుందని చెప్పారు. యూనియన్‌తో జరిపిన చర్చల్లో భాగంగా జీఓని వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సివిల్ సప్లయిస్ యాజమాన్యం ఇప్పటి వరకు జీఓని విడుదల చేయకపోవడం సరికాదని చెప్పారు. ప్రావిడెంట్ ఫండ్, పని భద్రతా, ఈఎస్‌ఐ సౌకర్యం అమలు చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు మాట్లాడుతూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయిస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోట్ల మరియదాసు, దానం, డేవిడ్, కాంతారావు, సురేషు ,బుజ్జి, జాన్ బాబు, శీను , మరియబాబు, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment