రాష్ట్రస్థాయి పోటీల్లో పమిడిపాడు ఎడ్ల ప్రతిభ
కారంచేడు: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. మండలంలోని స్వర్ణ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎద్దుల బండి పరుగు పోటీల్లో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నిర్వాహకుల వివరాల మేరకు.. స్వర్ణ గ్రామ ఎస్సీ కాలనీ వాసులు మేరీమాత ఆశీస్సులతో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మైసూరు ఎద్దుల టైరు బండి పరుగు పందేలు (జూనియర్ విభాగంలో) నిర్వహించారు. పోటీల్లో మొత్తం 25 జతల ఎడ్లు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యాయి. స్వర్ణ–దగ్గుబాడు రోడ్డులో 1.5 కిలోమీటర్ల దూరాన్ని బండితో తక్కువ సమయంలో ఛేదించిన ఎడ్లకు స్థానాలను బట్టి బహుమతులు అందించారు. దీనిలో పమిడిపాడుకు చెందిన నల్లమోతు సాయిహర్ష ఎడ్ల జత 4.44.99 నిమిషాల్లో లక్ష్యాన్ని సాధించి ప్రథమ స్థానంలో నిలిచి రూ.20 వేలు గెలుపొందింది. బాపట్ల మండలం చెరువు జమ్ములపాలేనికి చెందిన పార్వతీదేవి అమ్మవారి ఎడ్ల జత 4.52.45 నిమిషాల్లో లాగి రెండో స్థానంలో నిలిచింది. రూ.15 వేలు గెలుచుకుంది. స్వర్ణ గ్రామానికి చెందిన దుర్గారావు ఎడ్ల జత 4.57.61 నిమిషాల్లో గమ్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎడ్లకు రూ.10 వేలు బహుమతి అందించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన చెన్నకేశవస్వామి ఎడ్ల జత 5.10.13 నిమిషాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఎడ్లకు రూ.5 వేల బహుమతులు అందించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా గవిని కృష్ణ, హైస్కూల్ పీడీ కట్టా ప్రసాద్, ఎస్‌ఆర్‌కే ప్రసాద్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో నిర్వాకులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు.
స్వర్ణలో జూనియర్ ఎడ్ల బండి పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న జనం
Comments
Please login to add a commentAdd a comment