ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
సాక్షి కథనంతో కదిలిన అధికార యంత్రాంగం
కారెంపూడి: మండలంలో ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. పేట సన్నెగండ్ల గ్రామంలో పీపీసీ సెంటర్ ద్వారా తొలి రోజు 150 క్వింటాళ్ల బీపీటీ 5204 రకం ధాన్యాన్ని కొన్నారు. 75 కిలోల బస్తా రూ.1,700కు కొనుగోలు చేశారు. ధాన్యాన్ని తనిఖీ చేసి 17 శాతం లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ‘ధాన్యం..దైన్యం’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గానోర్ సూరజ్ ధనుంజయ్ స్పందించారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు వెంటనే స్పందించి హుటాహుటిన పేటసన్నెగండ్లలో ఉన్న పీపీసీ సెంటర్ ద్వారా కొనుగోళ్లు వెంటనే ప్రారంభించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా రైతులకు ధాన్యం కొనుగోళ్ల సమాచారం అందించారు. పిడుగురాళ్ల ఏడీఏ బి.శ్రీకృష్ణదేవరాయలు, ఏఓ బి.యలమందారెడ్డి పర్యవేక్షణలో పీపీసీ సెంటర్‌లో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. ఆరబెట్టి బస్తాలలో నిల్వ ఉంచుకున్న రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకు వచ్చి అమ్ముకున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం రేటు కూడా బస్తా రూ.1,700కు కొనడంతో మిగిలిన రైతుల్లో కూడా ధాన్యం అమ్ముకోవచ్చనే ఆశలు చిగురించాయి. రైతులందరూ ధాన్యం ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment