నత్తనడకన రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు
రేపల్లె రూరల్: రేపల్లె రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది కిందట చేపట్టిన పనులు యాభై శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ పథకంలో రేపల్లె రైల్వేస్టేషన్ ఎంపికై ంది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో నూతన భవనాల నిర్మాణం, ఆధునికీకరణ కోసం రూ.25.6 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2023 ఆగస్టు 7వ తేదీన వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. 2024 మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా నేటికీ 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. నెలల తరబడి సాగుతున్న పనులతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన ముడి వస్తువులు స్టేషన్ ప్రాంగణంలో విచ్చలవిడిగా పడవేయటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటంలేదు. వృద్ధులు, గర్భిణులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలన్నా, లోనికి రావాలన్నా మెట్లు లేకపోవటంతో పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారింది.
ఆదాయంలో రెండవ స్థానం
గుంటూరు రైల్వే డివిజన్‌లో ఆదాయంలో రెండో స్థానంలో ఉన్న రేపల్లె రైల్వేస్టేషన్ వసతుల కల్పనలో వెనుకంజలో ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాలోని తీరప్రాంత ప్రజలకు ప్రధాన రవాణా మార్గం రేపల్లె రైల్వేస్టేషన్ కావటంతో ఇక్కడి నుంచే వేల సంఖ్యలో నిత్యం రాకపోకలు సాగుతుంటారు. ప్రతి నిత్యం రేపల్లె రైల్వేస్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు 10వేల నుంచి 12వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం రూ.8 లక్షల వరకు ఆదాయం చేకూరుతుంది. అయినప్పటికీ ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించటంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
అగచాట్లు పడుతున్న ప్రయాణికులు
ఏడాది దాటినా 50 శాతం
పూర్తికాని పనులు
త్వరితగతిన పూర్తి చేయాలని
కోరుతున్న ప్రయాణికులు,
ప్రజా సంఘాలు
పనులు వేగవంతంచేయాలి
రేపల్లె రైల్వేస్టేషన్ అమృత భారత్ పథకం కింద ఎంపికై పనులు ప్రారంభం కావడం శుభసూచికమే. పనులు నత్తనడకన నడుస్తుండటం విచారకరం. స్టేషన్‌లోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం. స్టేషన్‌లో తాగునీరు తగినంత లేదు. పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలి.
సీవీ మోహనరావు,
పట్టణాభివృద్ధి సంఘ కార్యదర్శి, రేపల్లె
ఇబ్బందులు వర్ణనాతీతం
రేపల్లె రైల్వేస్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణం సాగిస్తుంటా రు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్‌పారం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. నిర్మాణ మెటీరియల్స్ ఎక్కడబడితే అక్కడ పడవేయటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలి.
–యడ్లపల్లి కిషోర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment