రహదారులు ఛిద్రం
రూ.113.71 కోట్లతో మరమ్మతులు అంటూ ప్రకటన
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘ఐదేళ్ల పాలనలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదు. అన్నీ పాడయ్యాయి. అడుగుతీసి అడుగుపెట్టే పరిస్థితి లేదు. వాహనాలు ముందుకు కదిలే అవకాశంలేదు. మాకు అధికారం అప్పగిస్తే మొదట పాడైన రోడ్లన్నింటినీ బాగుచేయడమేకాదు అన్ని కొత్తరోడ్లుగా మారుస్తాం.’ ఎన్నికల సమయంలో చంద్రబాబుతోపాటు కూటమి నేతలు పదేపదే చెప్పిన మాటలు ఇవి. కూటమి సర్కారు కొలువుదీరి ఏడు నెలలు పూర్తి కావస్తోంది. సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నింటినీ అద్దంలా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్రాంతి పండుగకు కేవలం 15 రోజులే గడువు ఉంది. కానీ ఇంతవరకు ఒక్క రహదారిపై గుంతలు పూడ్చిన దాఖలాలు లేవు. ఈ రహదారులపై రాకపోకలు కష్టతరంగా మారాయి.
కూటమి సర్కారు కొలువు దీరాక జిల్లాలో రూ.113.71 కోట్లతో 167 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా మొక్కుబడిగా కూడా పనులు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పటికై నా కూటమి సర్కారు రోడ్లను బాగుచేసి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గుంతల రహదారులే దిక్కు
● మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత నియోజకవర్గం రేపల్లెలో రహదారులు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. రేపల్లె నుంచి సజ్జావారిపాలెం వెళ్లే రోడ్డు 4 కిలోమీటర్ల మేర దెబ్బతింది. 8 కిలోమీటర్లు ఉన్న కూచినపూడి–నిజాంపట్నం రోడ్డు, సజ్జవారిపాలెం–నగరం, 14 కిలో మీటర్ల మేర ఉన్న పెనుమూడి–లంకెవానిదిబ్బ, 10 కిలోమీటర్ల అరవపల్లి–నల్లూరిపాలెం, 4 కిలోమీటర్లు ఉన్న గంగడిపాలెం–మోళ్లగుంటతోపాటు నియోజకవర్గంలో పలు రహదారులు పాడయ్యాయి.
● మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. చుండూరు మండలంలో రెండు కిలో మీటర్లు ఉన్న పెనపాడు–చిన్నపరిమిరోడ్డు, మూడు కిలోమీటర్ల చినగాదెలవర్రు, పాంచాలవరం–యలవర్రు, కొల్లూరు కరకట్ట–పెసర్లంక అరవిందవారధి, 2 కిలోమీటర్ల పెదగాదెలవర్రు, దోనెపూడి–పోతార్లంక, తెనాలి–రేపల్లె అడ్డరోడ్డు–రావికంపాడు, 5 కిలోమీటర్ల వేమూరు–చావలి, 20 కిలోమీటర్లు ఉన్న పెదరావూరు– చెరుకుపల్లి, 4 కిలో మీటర్ల పాంచాలవరం, చిలుమూరు– తెనాలి మెయిన్‌రోడ్డు, భట్టిప్రోలు– వెల్లటూరుతోపాటు పలురోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
● పర్చూరులోనూ రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. 14కిలోమీటర్లు ఉన్న ఇంకొల్లు–పర్చూరు రోడ్డు పూర్తిగా పాడైపోయింది. 8 కిలోమీటర్ల మార్టూరు–గన్నవరం, పూనూరు–నూతలపాడు, 5 కిలోమీటర్లు ఉన్న యద్దనపూడి, చిమాటావారిపాలెం–మున్నంగివారిపాలెం, స్వర్ణ–జరుబులవారిపాలెం, కారంచేడు–ఆదిపూడి, మార్టూరు–గన్నవరం, మున్నంగివారిపాలెం–జాగర్లమూడి, 3కిలోమీటర్ల గన్నవరం–పూనూరు, 14 కిలోమీటర్ల ఆదిపూడి–కారంచేడు, 2 కిలోమీటర్ల జొన్నతాలి– చిమ్మిరిబండతోపాటు పలు రోడ్లు దెబ్బతిన్నాయి.
● బాపట్ల నియోజకవర్గంలోనూ రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. 10 కిలోమీటర్ల కర్లపాలెం–పెద్దపులుగువారిపాలెం, 6 కిలోమీటర్ల యేట్రవారిపాలెం– అప్పికట్ల, అప్పికట్ల– మర్రిపూడి, పెదగొల్లపాలెం– తుమ్మలపల్లి, నరసాయపాలెం– జమ్ములపాలెం, వెదుళ్లపల్లి–కంకటపాలెం, 15 కిలోమీటర్ల చందోలు–పొన్నూరు, 8 కిలోమీటర్ల బాపట్ల– పాండురంగాపురంతోపాటు పలు రోడ్లు పాడయ్యాయి.
● చీరాల నియోజకవర్గంలో పలు రహదారులు దెబ్బతిన్నాయి. రెండు కిలోమీటర్ల బుర్లవారిపాలెం–హైవేరోడ్డు, ఈపూరుపాలెం– తోటవారిపాలెం, కిలోమీటర్ ఉన్న దండుబాట–కేఏపాల్ కాలనీ, బైపాస్‌రోడ్డు–యానాదికాలనీతో పాటు నియోజకవర్గంలో పలురోడ్లు పాడయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంతలు పూడ్చని కూటమి సర్కారు
చినుకు రాలితే రాకపోకలకు
నరకయాతన
ఎన్నికల ముందు జగన్ సర్కార్‌పై
నిందలు
పగ్గాలు చేపట్టాక పట్టించుకోని పరిస్థితి
జిల్లాలో మరింత అధ్వానంగా
రహదారులు
కూటమి పాలన తీరుపై
మండిపడుతున్న జనం
Comments
Please login to add a commentAdd a comment