జెస్సీ రాజ్‌కు ఘన స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలపురస్కార్ అవార్డు అందుకున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్‌కు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. న్యూఢిల్లీలో అవార్డు స్వీకరించిన తర్వాత జెస్సీ రాజ్ మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు పలువురు క్రీడా సంఘ పెద్దలు, క్రీడాభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
31 వరకు సచివాలయాల్లో ఎస్సీ కులగణన వివరాలు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనాభాపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం ఈనెల 26 నుంచి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణన వివరాలను ప్రదర్శిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 31 వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని వివరించారు. వచ్చిన అభ్యంతరాలను 2025 జనవరి 6న క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10న కులగణన తుది వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని ఆమె పేర్కొన్నారు.
హెల్మెట్ వాడకం తప్పనిసరి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మోటారు సైకిళ్లను నడపాలని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. హెల్మెట్ వాడకంపై అవగాహన నిమిత్తం పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద మోటారు సైకిళ్ల ర్యాలీని శుక్రవారం ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ వాడకంతో చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇబ్బందులు తప్పవని చెప్పారు. హెల్మెట్‌లు ధరించి వాహనాలు నడిపితే అన్ని విధాలా ఉపయోగకరమని చెప్పారు. పోలీసులు హెల్మెట్‌లు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఎ.హనుమంతు (ఏఆర్), సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కేసు వచ్చేనెల 16కి వాయిదా
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తోపాటు 18 మందిపై నమోదైన కేసును వచ్చేనెల 16కు న్యాయమూర్తి వాయిదా వేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్లిన సందర్భంగా జరిగిన ఘటనపై ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు శివ కుమార్‌తోపాటు మరో 18 మందిపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కేసు కావడంతో గుంటూరు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టిన రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వచ్చేనెల 16కు వాయిదా వేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తరఫున బార్ కౌన్సిల్ సభ్యులు వట్టిజోన్నల బ్రహ్మారెడ్డి, బార్ మాజీ అధ్యక్షుడు పొలూరి వెంకటరెడ్డి, న్యాయవాదులు జి.కృష్ణారావు, మొండితోక శ్రీనివాసరావు వకాల్తీ నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతున్నారని సమగ్రశిక్ష ఏపీసీ జి.విజయలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన చౌత్రా సెంటర్‌లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని అర్షియా ఫాతిమాను శుక్రవారం ఆమె అభినందించారు. ఏపీసీ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థిని అర్షియా ఫాతిమా జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంతోపాటు రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment