జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణం తగ్గించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ శుక్రవారం చేపట్టిన ఆందోళన హోరెత్తింది. ఉదయం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలకు శ్రేణులతోపాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ ర్యాలీలు చేపట్టారు. విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి నినదించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసినట్లుగా ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలను పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు ఇకనైనా నడుచుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది.
బాపట్లలో
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆందోళనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఉదయం రథం బజారులోని కోన భవన్ నుంచి విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని నినదించారు. అనంతరం అక్కడ నిరసన తెలిపారు. ఎస్‌ఈ ఆంజనేయులుకు వినతిపత్రం సమర్పించారు.
వేమూరులో
పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో భారీసంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు స్థానిక రైల్వే గేటు నుంచి విద్యుత్ ఏఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందించారు.
రేపల్లెలో
సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇసుకపల్లిలోని విద్యుత్ డీఈ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
చీరాలలో
సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తొలుత రామకృష్ణాపురం నుంచి వీఆర్‌ఎస్ కళాశాల వరకు ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత విద్యుత్ డీఈ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం ఏడీకి వినతిపత్రం సమర్పించారు.
పర్చూరులో
సమన్వయకర్త యడం బాలాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఎస్సీ కాలనీలో వైఎస్సార్ విగ్రహం నుంచి విద్యుత్ ఏఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
అద్దంకిలో
సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి శింగరకొండ రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేశారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ శాఖ కార్యాలయం ప్రధాన గేటుకు ఇరువైపులా వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్న వ్యాఖ్యలతో గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పానెం చిన హనిమిరెడ్డి తెలిపారు.
ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ నేతలు జాన్సీ, లీలా శ్రీనివాసరెడ్డి, డేవిడ్, కోకి రాఘవరెడ్డి, విజయకుమార్, ఏడుకొండలు, రఘురామిరెడ్డి, మోహన్‌రెడ్డి, పద్మారావు, జంజనం శ్రీనివాసరావు, గౌని శ్రీనివాసరావు, వెంకట్రావు, అరుణ్, భాస్కర్‌రావు, కొల్లా వెంకట్రావు, కటారి అప్పారావు, ప్రభాకరరావు, నాగేశ్వరరెడ్డి, జ్యోతిహనుమంతరావు, రాధాకృష్ణమూర్తి, కరేటి శేషగిరి, మేడికొండ అనిల్, ఇంకొల్లు రామకృష్ణ, బగ్గా రెడ్డి, చిమటా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు పెంచిన చార్జీలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ వైఎస్సార్ సీపీ శ్రేణులకు అన్నివర్గాల నుంచి భారీ మద్దతు కూటమి సర్కార్ తీరుపై అన్నిచోట్ల పెల్లుబికిన ప్రజాగ్రహం
కూటమి బాదుడుపై వైఎస్సార్ సీపీ కదన భేరి మోగించింది. విద్యుత్ చార్జీల పేరిట అడ్డగోలు వసూలుపై కన్నెర్ర చేసింది. ప్రజలతో కలిసి పోరుబాట పట్టింది. పెంచిన విద్యుత్తు చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. ప్రజల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్న కూటమి తీరుపై మండిపడింది. పేదలు, మధ్యతరగతిపై పెనుభారం మోపిన పాలకలు తీరును ఎండగట్టింది. నిరసన గళం వినిపించి ప్రజాపక్షమై కూటమి సర్కార్ వైఖరిని ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment