తమ్ముళ్ల మధ్య ఇసుక ‘ఫైర్’
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇసుక, భూములు, మద్యం, అక్రమ వ్యాపారాల్లో తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. వాటాలు వేసుకుని ప్రకృతి వనరులను పప్పుబెల్లాల్లా పంచుకుని దండుకుంటున్నారు. చీరాల కేంద్రంగా ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులే ఈ తతంగం నడిపిస్తుండటంతో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తూ జీ హుజూర్ అంటోంది. ఇప్పుడు ఇది కాస్తా వాటాలా కుదరక తెలుగు తమ్ముళ్ల మధ్య ‘ఫైర్’ రాజేసింది. ఒకరు ఎంపీ అనుచరుడు కాగా.. మరొకరు ఎమ్మెల్యే వర్గంలోని వ్యక్తి కావడం గమనార్హం.
చీరాల: ప్రభుత్వ లెక్కల ప్రకారం చీరాల రూరల్, వేటపాలెం మండలం, చినగంజాం ప్రాంతాల్లో ఇసుక సమృద్ధిగా ఉంటుంది. అయితే అవన్నీ ప్రైవేటు, అసైన్డ్ భూములు కావడంతో ఏ ఒక్కరికీ అనుమతి లేదు. కానీ రోజుకు 500 ట్రాకర్ ట్రక్కులు, 200 లారీల ఇసుక పట్టపగలే తరలిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇసుక నిరంతరం తవ్వడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. చీరాలంటే ఇసుక ప్రాంతం అనే పరిస్థితి పోయి ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను కొనుగోలు చేసే స్థాయికి చేరింది. ఇదంతా టీడీపీ నాయకులు, పెద్దల కనుసన్నల్లోనే జరగడం వారి అక్రమార్జనకు అద్దంపడుతోంది. ప్రాంతాల వారీగా విభజించి మరీ ఇసుకను తవ్వుతూ జేబులు నింపుకొంటున్నారు.
టీడీపీ నేతల మధ్య వాటాల గొడవలు
దీంతో ఇప్పటికే ఇసుక మాఫియా మధ్య అనేక వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సమస్య జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి వెళ్లింది. చివరికి ఇసుక వాటాలు పంచుకునే విషయంలో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి జేసీబీలను తగలబెట్టుకున్న ఘటన చీరాల రూరల్ మండలం బోయినవారిపాలెంలో చోటు చేసుకుంది. ఈపురుపాలెం పంచాయతీలోని బోయినవారిపాలెం శివారులో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటారు. ఒక్కో ట్రక్కు రూ.4 వేల చొప్పున విక్రయిస్తున్నారు. బాగా లాభసాటిగా ఉండటంతో కొద్దినెలలు ఇసుక వ్యాపారం చేస్తే జీవితం సెటిల్ అవుతుండటంతో టీడీపీ నేతలు చాలామంది దృష్టి సారించారు. చాలాకాలంగా ఇ.రామకృష్ణ జేసీబీలతోపాటు సొంత ట్రాక్టర్లు ద్వారా ఇసుకను చీరాల, బాపట్ల వైపు తరలిస్తున్నారు. ఈయన బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అనుచరుడుగా పేరొందారు. జితేందర్ అనే వ్యక్తి కూడా ఇసుక వ్యాపారం చేస్తుంటారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యకు సంబంధించిన వ్యవహారాలు చూసే రాజేష్‌రెడ్డికి ఈయన అనుచరుడు. ఇసుక అక్రమ రవాణాలో ఇరువురు మధ్య కొంతకాలంగా మంచి సంబంధాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ క్వారీల్లో తనకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలని జితేందర్ పోటీపడుతున్నారు. పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. చర్చలు కూడా జరిగాయి. అయినా రామకృష్ణ ససేమిరా అన్నారని సమాచారం. దీంతో శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో రామకృష్ణకు చెందిన క్వారీ వద్ద నిలిపి ఉంచిన జేసీబీని సుమోలో వచ్చిన వారు పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన చీరాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇసుక వివాదాలు ఎక్కడివరకు దారి తీస్తాయోనని బోయినవారిపాలెం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జేసీబీ దహనంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీరాల రూరల్ సీఐ పి.శేషగిరిరావు, రూరల్ ఎస్సై చంద్రశేఖర్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలు చూసి తగిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
అక్రమ తవ్వకాలతో అడ్డగోలుగా సంపాదిస్తున్న బాపట్ల ఎంపీ అనుచరుడు తనకూ వాటా కావాలని టీడీపీ ఎమ్మెల్యే వర్గంలోని వ్యక్తి డిమాండ్ ఒప్పందం కుదరక ఇరువర్గాల మధ్య కొన్ని రోజులుగా ప్రచ్ఛన్న యుద్ధం ఎంపీ అనుచరుడు రామకృష్ణకు చెందిన క్వారీ వద్ద జేసీబీ దహనం ఎమ్మెల్యే వర్గంలోని జితేందర్ పనేనంటూ పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment