జిల్లా అభివృద్ధికి అధికారులు చొరవ తీసుకోవాలి
బాపట్లటౌన్: జిల్లా అభివృద్ధికి అధికారులు చొరవ తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. మంత్రి కొలుసు మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్–2047 నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అభివృద్ధి విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. రోడ్ల మరమ్మతు పనుల్లో గుత్తేదారులు నాణ్యత పాటించకపోతే ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమంలో జాప్యంపై పలువురు ప్రజాప్రతినిధులు ఆర్ అండ్ బీ అధికారులను ప్రశ్నించారు. దీంతో సీఆర్‌ఎఫ్, ఎండీఆర్‌ఎఫ్ పెండింగ్ పనులపై మంత్రి కొలుసు ఆరా తీశారు. నిధులు ఇస్తున్నప్పటికీ ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. ప్రారంభించని పనులను రద్దు చేయాలని ఆదేశించారు. నిబంధనలు విస్మరించిన గుత్తేదారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అమృతధార పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తామన్నారు. సాగునీటి కాల్వల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 92 ఎత్తిపోతల పథకాల కింద 1.07 లక్షల ఎకరాలు పంటలు సాగు అవుతుండగా, 67 పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు, శాశ్వత సమస్యల పరిష్కారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.110 కోట్లతో ఉపాధి పనులు జరుగుతుండగా, రూ.31 కోట్ల పనులు మిగలడంపై అసహనం వ్యక్తం చేశారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. టీఏ, ఎఫ్‌ఏ ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సూర్యలంక, చీరాల బీచ్ అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్దికి రూ.97 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి నివేదించామన్నారు. బాపట్ల జిల్లాలో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మరో ఏడు వేల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రభుత్వం తాజాగా అనుమతించిందన్నారు.
సూర్య ఘర్ పథకం విస్తరణకు సహకరించాలి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సూర్య ఘర్ పథకం కింద 334 యూనిట్లు ఏర్పాటు చేశామని, మరింత విస్తరింప చేయడానికి బ్యాంకులు సహకరించాలన్నారు. అద్దంకి నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నామన్నారు. సాగు కాల్వల పెండింగ్ బిల్లులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సాగు కాల్వల మరమ్మతులు చేపట్టాలి
రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ సాగునీటి కాల్వల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. వెల్లటూరు కాల్వ పనుల్లో జాప్యం చేయరాదన్నారు. రేపల్లె నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన తనిఖీలలో దస్త్రాలు చూపకుండా పలుమార్లు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
నిధులు విడుదలకు సీఎం హామీ
బాపట్లలో వైద్య కళాశాల నిర్మాణానికి మూడో విడతలో నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రుణ సదుపాయం కల్పించాలని అధికారులకు సూచించారు. సూర్యఘర్ పథకానికి బ్యాంకుల సహకరించాలన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి
జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం
హాజరైన మంత్రులు అనగాని, గొట్టిపాటి
రూ.3,500 కోట్లతో డీపీఆర్
కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి నీరు సరఫరా చేయడానికి రూ.3,500 కోట్లతో డీపీఆర్ పంపామన్నారు. అమృత ధార పథకం కింద 2.16 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలలోని 18 మండలాలకు నీరు అందించేలా రూ.1,820 కోట్లతో నివేదించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మ, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జేసీ ప్రఖర్ జైన్, డీఆర్వో జి గంగాధర్‌గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment