పోస్టల్‌ బ్యాలెట్‌కు 8 వరకు అవకాశం | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌కు 8 వరకు అవకాశం

Published Sun, May 5 2024 1:15 AM

పోస్టల్‌ బ్యాలెట్‌కు 8 వరకు అవకాశం

ఇల్లెందు : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈనెల 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోని రెండు పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాలను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,105 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 239 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాల లైవ్‌లో ఓటింగ్‌ ప్రక్రియ సాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకునే ఉద్యోగులు ఆరు వేల మంది ఉన్నారని, ఇల్లెందు నియోజకవర్గంలో 978 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి జె.కాశయ్య, తహసీల్దార్‌ కె. రవికుమార్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు సకాలంలో

యూనిఫాం అందించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం) : పాఠశాల విద్యార్థులకు జూన్‌ మొదటి వారంలోగా యూనిఫాం అందించాలని కలెక్టర్‌ ప్రియాంక ఆల అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కుట్టు పనిలో నైపుణ్యం గల స్వయం సహాయక బృందాలకు యూనిఫాం కుట్టే బాధ్యత అప్పగించాలన్నారు. యూనిఫాం ఆకృతులు విద్యార్థులను ఆకట్టుకునేలా ఉండాలని సూచించారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు గల బాలికలకు ఫ్రాక్‌తో కూడిన డ్రెస్‌, 4, 5 తరగతుల వారికి స్కర్ట్‌, 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు పంజాబీ డ్రెస్‌ కుట్టించాలని ఆదేశించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గల బాలురకు షర్ట్‌, నిక్కర్‌, 8 నుచి 12వ తరగతి బాలురకు షర్ట్‌, ప్యాంటు కుట్టించాలని, ఇందుకోసం బూడిద రంగు చెక్స్‌ కలిగిన వస్త్రాన్ని ఉపయోగించాలని చెప్పారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా యూనిఫాం క్లాత్‌ పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఒక్కో జత కుట్టు కూలి రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 చెల్లించేలా నిధులు కేటాయించామని చెప్పారు. ప్రతి మండలానికి రెండు చొప్పున శాశ్వత కుట్టు మిషన్‌ కేంద్రాలను నెలకొల్పి 10 మిషన్లను నిరంతరం నడిపించాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ ప్రసూనా రాణి, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీపీఓ చంద్రమౌళి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు అనసూర్య, ఇందిర, డీఐఈఓ సులోచనారాాణి పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల

Advertisement
Advertisement