అక్షరాస్యత పెంపే లక్ష్యంగా.. | Sakshi
Sakshi News home page

అక్షరాస్యత పెంపే లక్ష్యంగా..

Published Thu, May 9 2024 6:20 AM

అక్షర

● బడిబయట ఉన్న చిన్నారుల కోసం సర్వే ● ప్రతీ జనవరి, మే నెలల్లో నిర్వహణ ● ఈ ఏడాది ఇప్పటివరకు 572 మంది గుర్తింపు ● వచ్చే నెల పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు

జనవరిలో సర్వే వివరాలు ఇలా..

వయసు బాలురు బాలికలు మొత్తం

6 – 14 267 162 429

15 – 19 101 42 143

కొత్తగూడెంఅర్బన్‌: మధ్యలో చదువు మానేసి పనులకు వెళ్తున్న బడి ఈడు బాలబాలికలను గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి వారి కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జనవరి, మే నెలల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలోని 23 మండలాల్లో 90 మంది సీఆర్పీలు బడి మానేసిన పిల్లల గుర్తింపు కోసం గ్రామాల బాట పట్టారు. ఆరు సంవత్సరాలు, ఆపైబడిన వారిని గుర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. జనవరి, మే నెలల్లో చేసిన సర్వే వివరాల ప్రకారం ఒక ప్రణాళిక తయారు చేసి జూన్‌ నాటికి ఎంఈఓలకు నివేదిక అందిస్తారు. దాని ఆధారంగా ఉపాధ్యాయులు పాఠశాలలు తెరవగానే వారిని రీ అడ్మిషన్లు చేయిస్తున్నారు. అయితే ఈ తంతు ప్రతీ ఏడాది జరుగుతున్నా.. ఈ సంవత్సరం బడి బయట ఉన్న పిల్లల సంఖ్య ఒక జనవరి నెల సర్వేలోనే 572 మంది ఉన్నట్లు తేలడం గమనార్హం. బాలబాలికల కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, కుటుంబ పెద్దలు అనారోగ్యానికి గురి కావడం, చిన్నారులు పనికి వెళ్లకుంటే ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో చదువుకోవాల్సిన వయసులో పనిబాట పడుతున్నారు. దీంతో జిల్లాలో అక్షరాస్యత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉండడంతో దాని నివారణకు సీఆర్పీలు చర్యలు చేపడుతున్నారు.

ఈ పనుల్లోనే ఎక్కువగా..

జిల్లాలో చదువు మానేసి పనిలోకి వెళ్లే బాలబాలికలు ఎక్కువగా ఇటుక బట్టీలు, సిమెంటు బ్రిక్స్‌ తయారీ, కిరాణాషాపులు, షాపింగ్‌ మాళ్లు, హోటళ్లలో కూలీలుగా మారుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బాల కార్మికులు పని చేస్తున్నారని తరుచుగా కార్మిక శాఖ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతుంటాయి. ఆ సమయంలో మాత్రమే సంబంధిత అధికారులు అక్కడికి వెళ్లి షాపు యజమానులకు జరిమానాలు విధించి, ఆ తర్వాత పట్టించుకోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ చిన్నారులు పనులకు వెళుతూనే ఉన్నారు. దీంతో ఇటీవల చేపట్టిన సర్వేలో 572 మంది బాలబాలికలు బడిబయట ఉన్న విషయం వెలుగుచూసింది. ఇక ఈ నెల సర్వే పూర్తయితే ఇంకెంత మంది బయటపడుతారో వేచి చూడాల్సిందే. ఇలా గుర్తించిన వారంతా తిరిగి పాఠశాలలకు వెళితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.

బడి బయట పిల్లలను

చేర్పించడమే లక్ష్యం

బడి బయట ఉన్న బాలబాలికలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా సర్వే అనంతరం అడ్మిషన్లు చేయిస్తున్నాం. సర్వేలో మొదట బాలబాలికల గుర్తింపు, బడి మానేయడానికి గల కారణాలు తెలుసుకుంటున్నాం. వారిని తిరిగి బడికి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాం. దగ్గరలో ఉన్న స్కూల్‌, హాస్టల్‌కు పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం. దీంతో పాటు జిల్లాలో 15 సంవత్సరాలు పైబడిన వారిని ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్లు ఇప్పించి, సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి కొంత స్కాలర్‌షిప్‌ వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం.

– నాగరాజశేఖర్‌,

ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ కో– ఆర్డినేటర్‌

అక్షరాస్యత పెంపే లక్ష్యంగా..
1/1

అక్షరాస్యత పెంపే లక్ష్యంగా..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement