ఆది నుంచీ అదే తంతు.. | - | Sakshi
Sakshi News home page

ఆది నుంచీ అదే తంతు..

Published Tue, Nov 5 2024 12:20 AM | Last Updated on Tue, Nov 5 2024 12:20 AM

ఆది నుంచీ అదే తంతు..

ఆది నుంచీ అదే తంతు..

అధికారుల ప్రణాళికా లేమి సీతారామ

ప్రాజెక్టుకు శాపంగా మారింది. ప్రాజెక్టు ఎలా నిర్మించాలి, ఆయకట్టు ఏ విధంగా నిర్ణయించాలి, బరాజ్‌ నిర్మాణం ఎలా ఉండాలనే

అంశాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ఆది నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా

మారుతూనే ఉన్నాయి. తాజాగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనుల టెండర్ల అంశం వివాదాస్పదంగా మారింది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

నిలిచిపోయిన సీతారామ ప్రాజెక్ట్‌ పనులు (ఫైల్‌)

ఇల్లెందు.. గల్లంతు..

రూ.7,926 కోట్ల అంచనా వ్యయంతో 2016లో సీతారామ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 10 టీఎంసీల సామర్థ్యంతో ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించాల్సి ఉంది. శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులు ప్రారంభించే సమయంలో కిన్నెరసాని అభయారణ్యం, రిజర్వ్‌ ఫారెస్ట్‌, రైల్వేట్రాక్‌లను సాకుగా చూపుతూ మొత్తం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చేశారు. దీంతో సీతారామలో ఇల్లెందు గల్లంతయింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.13,057 కోట్లకు పెరిగింది.

భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం..

గోదావరిపై బరాజ్‌ నిర్మించిన తర్వాత బ్యాక్‌ వాటర్‌ ఎగువన గోదావరిలో కలిసే వాగుల్లోకి తిరిగి వెళ్లే అంశం ఆదిలోనే విస్మరణకు గురైంది. బరాజ్‌కు ఎగువన 54 కి.మీ. వరకు ఇరువైపులా కరకట్ట నిర్మాణ పనులు మొదలుపెట్టిన తర్వాత వాగుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో వాగుల్లో ఎంత మేరకు కొత్తగా కరకట్టలు కట్టాలి, పంపుహౌస్‌ల అవసరం పడుతుందా ? అనే అంశాలపై దృష్టి పెట్టడంతో నిర్మాణ వ్యయం ఏకంగా రూ.19 వేల కోట్లకు పెరిగిపోయింది.

ఎస్కేప్‌ చానళ్లపై శ్రద్ధ లేకనే..

సీతారామ ప్రధాన కాలువకు గండ్లు పెట్టాల్సి రావడం ఇంజనీర్లు వైఫల్యానికి మరో ఉదాహరణగా నిలుస్తోంది. భారీగా వర్షపు నీటి వరద చేరడంతో పాల్వంచ – ములకలపల్లి మండలాల మధ్య ఇప్పటికే రెండు సార్లు, చండ్రుగొండ మండలంలో ఒకసారి గండి పెట్టాల్సి వచ్చింది. గండ్లు పెట్టకుంటే వరద నీరు పెరిగి పంపుహౌస్‌లకు ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉండడంతో తామే గండ్లు పెట్టామని ప్రాజెక్టు ఇంజనీర్లు చెప్పడం మరో విశేషం. ముర్రేడు, కిన్నెరసానిలపై భారీ అక్విడెక్టులు నిర్మించడంపై చూపిన శ్రద్ధ ఎస్కేప్‌ చానళ్లపై పెట్టకపోవడంతో మరోసారి అంచనా వ్యయం పెరిగినట్టయింది.

డీపీఆర్‌కు అనుమతులు ఎప్పుడు ?

సీతమ్మ సాగర్‌ పేరుతో దుమ్ముగూడెం – అశ్వాపురం మండలాల మధ్య గోదావరిపై నిర్మిస్తున్న బరాజ్‌ పనులు ఆగిపోయి ఏడాదిన్నర కావస్తోంది. బరాజ్‌, ప్రాజెక్టుల స్వరూప స్వభావాలు పదేపదే మార్చడం, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం తదితర కారణాలతో పర్యావరణ అనుమతులు రాలేదు. మరోవైపు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారంపై నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముందుగా హైకోర్టును, ఆ తర్వాత నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. చివరకు ఎన్‌జీటీ ఉత్తర్వులతో బరాజ్‌ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇదే బరాజ్‌లో జల విద్యుత్‌ కేంద్రం ఉంటుందా? ఉండదా ? అనే అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదు.

‘సీతారామ’ను

వెంటాడుతున్న నిర్లక్ష్యం

శంకుస్థాపన చేసిన రెండేళ్లకు

రీ డిజైనింగ్‌

గోదావరి బ్యాక్‌ వాటర్‌పై

తప్పిన అంచనాలు

కొత్తగా ప్రధాన కాలువలో

ఎస్కేప్‌ చానళ్లు

బరాజ్‌ డీపీఆర్‌కు దక్కని అనుమతులు

తాజా వివాదం ఇలా..

ప్రధాన కాలువ వెంట 74 కి.మీ. వద్ద ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌, 74 కి.మీ. నుంచి 98 కి.మీ. మధ్యన రెండో డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నిర్మిస్తే 72 వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. దీనికి 3,021 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, రూ.1,050 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. అయితే పరిపాలన అనుమతులు లేకుండా వీటికి టెండర్లు పిలవడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. టెండర్ల వివాదం అలా ఉంచితే ఏ మండలం, ఏ గ్రామం దగ్గర డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు వస్తాయి, ఎన్ని గ్రామాల్లో భూమిని సేకరిస్తారు, ఏ గ్రామాల పరిధిలో కొత్త ఆయకట్టు వస్తుందనే అంశంపై స్పష్టత లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement