ముగిసిన రాష్ట్రస్థాయి టీటీ పోటీలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న అండర్ – 17 బాల బాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. టీం చాంపియన్‌షిప్, వ్యక్తిగత అంశాల్లో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. టీం చాంపియన్‌షిప్ విభాగంలో హైదరాబాద్ బాలబాలికల జట్లు అద్భుత ప్రతిభ కనబరిచాయి. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి బాలబాలికల జట్లు నిలవగా, బాలికల టీం చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానాన్ని ఖమ్మం జట్టు కై వసం చేసుకుంది. బాలుర విభాగంలో నిజామాబాద్ జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది. వ్యక్తిగత బాలుర సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన జతిన్ దేవ్ ప్రథమ స్థానంలో నిలవగా, తరుణ్ ద్వితీయ స్థానం సాధించాడు. తృతీయ స్థానాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన అరూష్ రెడ్డి సాధించాడు. బాలికల వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన శశిరిత ప్రథమ, శ్రేష్టారెడ్డి ద్వితీయ, చైత్రారెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన ముగింపు సభలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ స్థాయి పోటీలకు బాలుర విభాగంలో జతిన్‌దేవ్, తరుణ్, దేవాన్ష్సింగ్, రిషబ్సింగ్, ఆరుష్ రెడ్డి, స్టాండ్ బైలుగా కార్తీక్ తేజ, పి.జ్వలిత్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో డి.సుశ్రీత, సి.శ్రేష్టారెడ్డి, డి.చైత్రారెడ్డి, అవనిరెడ్డి ఎంపిక కాగా, సిరిచందన, నవ్యశ్రీ, ధరణి స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో పోటీల పరిశీలకులు మామిడి సంతోష్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వాసిరెడ్డి నరేష్కుమార్, పామర్తి శ్రీనివాస్, సుధీర్, మంజుల, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment