ప్రయోగాలకు వేళాయె..
● సైన్స్‌ఫేర్‌కు సన్నద్ధమవుతున్న విద్యాశాఖ ● ఈనెల 18 నుంచి మూడురోజుల పాటు నిర్వహణ ● విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పెంచడమే లక్ష్యం ● వసతి, భోజన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
కొత్తగూడెంఅర్బన్: అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈనెల 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, ఆరోగ్యం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అభిరుచి కలిగించేందుకు ప్రతీ సంవత్సరం సైన్స్ యాక్టివిటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ప్రతీ నవంబర్, డిసెంబర్ నెలల్లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సైన్స్‌ఫేర్ ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ‘రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శన (ఆర్‌బీవీపీ) ఫర్ చిల్డ్రన్స్’ పేరుతో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైన్స్‌ఫేర్‌లో ‘సుస్థిర భవిష్యత్ కోసం శాస్త్ర సాంకేతిక రంగం’ అనేది ప్రధానాంశంగా ఉంటుంది. ఇందులో మళ్లీ ఏడు ఉప అంశాలుగా రూపొందించారు. వీటి ఆధారంగానే విద్యార్థులు ఎగ్జిబిట్లను రూపొందించుకోవాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
అంశాలు ఇవే..
సైన్స్‌ఫేర్‌లో ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతతో పాటు రవాణా కమ్యూనికేషన్, సహజ వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, నమూనాలు –గణన ఆలోచనలు, వ్యర్థాల నిర్వహణ, వనరుల నిర్వహణ అనే అంశాలు ఉన్నాయి. ఇవేకాకుండా విద్యార్థులకు సెమినార్ కూడా నిర్వహించనున్నారు. పోటీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది. కాగా, సైన్స్‌ఫేర్‌లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులను సీనియర్లుగా, 6,7,8 తరగతుల వారిని జూనియర్లుగా విభజిస్తారు. ప్రతి పాఠశాల నుంచి మూడుకు తగ్గకుండా, ఏడుకు మించకుండా ప్రాజెక్టులు ప్రదర్శించాల్సి ఉంటుందని, ఒక్కో గైడ్ టిచర్ మాత్రమే ఇన్‌చార్జ్‌గా హాజరు కావాలని అధికారులు సూచించారు.
18 కమిటీల ఏర్పాటు..
సైన్స్‌ఫేర్ విజయవంతానికి జిల్లాలోని ఉపాధ్యాయులతో 18 కమిటీలు ఏర్పాటు చేశారు. బాలికలకు అన్నపురెడ్డిపల్లి రెసిడెన్షియల్ పాఠశాల, కేజీబీవీల్లో, బాలురకు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో వసతి కల్పించనున్నారు. బాలికలకు ఇన్‌చార్జ్‌లుగా మహిళా ఉపాధ్యాయులను నియమించనున్నారు. విద్యార్థులు ప్లేట్, గ్లాస్‌తో పాటు శీతాకాలం అయినందున బ్లాంకెట్లు కూడా తెచ్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది పోటీలకు 500 పైగా ఎగ్జిబిట్లు వస్తాయని, 1700 నుంచి 2000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల సైన్స్‌ఫేర్‌కు రూ.8 నుంచి 9 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంటుందని, ఎస్‌సీఐఆర్‌టీ నుంచి రూ.50 వేలు మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రవేత్తలతో ప్రసంగాలు, ఐటీడీఏ పాఠశాలలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించనున్నారు.
సైన్స్‌ఫేర్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం
అన్నపురెడ్డిపల్లిలో మూడు రోజుల పాటు జరిగే సైన్స్‌ఫేర్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తాం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజనంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– వెంకటేశ్వరాచారి, డీఈఓ
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పెంచేందుకే..
విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు ప్రతి ఏడాది సైన్స్‌ఫేర్ నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించి ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థులతో ఎక్కువ సంఖ్యలో ఎగ్జిబిట్లు తయారు చేయించి, సైన్స్ ఫేర్‌లో పాల్గొనేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి.
– చలపతిరాజు, జిల్లా సైన్స్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment