కలలు కన్నారు.. సాధించారు!
● వార్డెన్ స్ఫూర్తిగా.. వార్డెన్లకు బాస్‌గా
కొత్తగూడెంరూరల్: పాల్వంచ హాస్టల్‌లో చదువుకుంటున్న సమయాన మా వార్డెన్‌ను చూసి ఉద్యోగం సాధించాలని అనుకున్నా. ఇప్పుడు జిల్లాలో వార్డెన్లను సమన్వయం చేసే బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. పాల్వంచ కేటీపీఎస్‌లో మా నాన్న ఇనుపనూరి సాయిల్ ఉద్యోగి. మా అమ్మ ముత్తమ్మ. అమ్మానాన్నలకు మేం ఎనిమిది సంతానం కాగా నేను ఐదో కుమార్తెను. అందరూ కుమార్తెలే కావడంతో నాన్న నన్ను కొడుకులా పెంచారు. కేటీపీఎస్ అభ్యుదయ పాఠశాలలో పదో తరగతి వరకు చదివా. అయితే, మూడో తరగతిలో సరిగా చదవడం లేదని టీచర్లు నాన్నకు చెప్పడంతో 4వ తరగతిలో పాల్వచంలోని హాస్టల్‌లో చేర్పించారు. అప్పడు మా విద్యాబుద్ధులు పర్యవేక్షించే వార్డెన్‌ను చూసి నేనూ ఆ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని నాన్నకు కూడా చెప్పాను. ఐదో తరగతి తర్వాత మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. పాల్వంచలోనే ఇంటర్, డిగ్రీ చదివాను. 2002లో జూనియర్ అసిస్టెంట్‌గా భద్రాచలంలో ఉద్యోగం వచ్చింది. పదేళ్ల తర్వాత ఏఓగా పదోన్నతి లభించింది. 2023లో భద్రాద్రి జిల్లా బీసీ సంక్షేమ అధికారి గా బాధ్యతలు స్వీకరించా. ఇప్పుడు శాఖ పరిధిలోని హాస్టళ్లను పర్యవేక్షిస్తున్నా. ఈ తరం విద్యార్థులు చిన్న నాటి నుంచి లక్ష్యాన్ని ఎంచుకుని శ్రద్ధతో చదివితే భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరతారు. పదిహేనేళ్లు కష్టపడితే ఆతర్వాత జీవితం ప్రశాతంగా సాగుతుందని గుర్తించాలి.
– ఇందిర, బీసీడబ్ల్యూఓ
● కిరోసిన్ దీపం కింద కూర్చుని చదివా..
పాల్వంచ: మాది ప్రస్తుత సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతారాంపురం తండా. అమ్మానాన్నలు తావూర్యా – సాజీకి మేం నలుగురు సంతానం. ఐదెకరాల భూమిలో పంటలు సాగుచేస్తూ నాన్న కుటుంబాన్ని పోషించేవారు. పెద్దకుమారుడిగా నేను అమ్మానాన్నతో వ్యవసాయ పనులకు వెళ్లేవాడిని. 1 నుంచి 7వ తరగతి వరకు తండా నుండి ఆరు కి.మీ. దూరాన రేపాలకు నడుచుకుంటూ వెళ్లి చదువుకున్నాక 8, 9, 10, ఇంటర్ సూర్యాపేట హాస్టల్‌లో ఉంటూ పూర్తిచేశా. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఏపీఎస్‌ఈబీలో 1990లో ఏఈగా ఉద్యోగం వచ్చింది. మూడు నెలల శిక్షణ అనంతరం పాల్వంచ కేటీపీఎస్‌లో ఏఈగా చేరా. అయితే, ఇదంతా సాఫీగా ఏం జరగలేదు. చిన్నతనాన తండాలో కరెంట్ లేకపోగా కిరోసిన్ దీపాల కింద చదువుకున్నా. పదో తరగతి వరకు చెప్పులు కూడా లేవు. మునగాల మండలంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన తొలివ్యక్తిని నేనే. ఇందుకు నాన్న ప్రోత్సహమే కారణం. నాకు 1991లో డోర్నకల్‌కు చెందిన శాంతాబాయ్‌తో వివాహం జరగగా భార్గవి, దినేష్ కుమార్ సంతానం. ఏఈ నుంచి ఏడీఈ, డీఈ, ఎస్‌ఈ, సీఈ వరకు కేటీపీఎస్‌లోనే పదోన్నతులు పొందిన నేను శ్రీశైలం, కేటీపీఎస్, విద్యుత్ సౌధల్లో సీఈగా పనిచేశాక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందా. కేటీపీఎస్, వైటీపీఎస్, బీటీపీఎస్, కేటీపీపీ, ఆర్‌టీపీపీల్లో పనిచేస్తూ ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగాను. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకుని కష్టాలు ఎదురైనా ముందుకు సాగితే మంచి ఫలితం వస్తుంది. తెలియని విషయాన్ని అడగడంలో బిడియపడొద్దు. నాకు సైతం విధుల్లో ఐదు శాతమే తెలుసు.. మిగతా 95శాతం సహచరుల సహకారంతో పనిచేస్తుండడంతో విజయాలు సొంతమయ్యాయి.
– బాదావత్ లక్ష్మయ్య, టీజీ జెన్‌కో డైరెక్టర్(థర్మల్)
● మూడు కి.మీ. నడిస్తేనే చదువు
పాల్వంచరూరల్: కష్టపడితే ఫలితం తప్పక వస్తుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన బుచ్చిరాంరెడ్డి – వెంకటలక్ష్మికి నేను మూడో కుమారుడిని. ఇంటర్ వరకు స్వగ్రామం, కరీంనగర్‌లో చదివాక ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తిచేశా. చిన్నతనంలో స్కూల్‌కు వెళ్లడానికి మూడు కి.మీ. నడిచి వెళ్లేవాళ్లం. మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉండడంతో చదువును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగడంతో ఈ స్థాయికి చేరా.
– ఎ.శ్రీనివాసరెడ్డి, జలవనరులశాఖ సీఈ
Comments
Please login to add a commentAdd a comment