●అత్యధిక ఓఈఆర్ సాధించిన పామాయిల్ ఫ్యాక్టరీ
●ఇదే ఓఈఆర్‌పై పే పాలసీ నిర్ధారణ
అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్ మరో మైలురాయిని చేరుకుంది. దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అత్యధిక ఓఈఆర్(ఆయిల్ ఎక్టార్షన్ రేష్యో)ను సాధించి రికార్డు సృష్టించింది. ఫ్యాక్టరీ గత రికార్డు 19.11 ఓఈఆర్ ఉండగా 2023–24 ఆయిల్ ఇయర్‌లో అత్యధిక ఓఈఆర్ 19.42 సాధించింది. ఇందుకోసం రైతులు నాణ్యమైన గెలలను ఫ్యాక్టరీకి సకాలంలో సరఫరా చేయడం ప్రధాన కారణమైతే సిబ్బంది శ్రద్ధతో ఫ్యాక్టరీని నిర్వహించడం మరో కారణంగా చెప్పవచ్చు. కాగా గతేడాది ఎఫ్‌ఎఫ్‌బీ(గెలలు) ధర నిర్ణయించేందుకు ఓఈఆర్ 19.02 ఉండగా పేమెంట్ పాలసీ కోసం ఈ ఏడాది సరాసరి ఓఈఆర్‌ను తీసుకోవాలని రైతు సంఘ నాయకులు ఆయిల్‌ఫెడ్‌ను కోరారు. దీంతో జాతీయ ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీల యజమాన్యాల సమాఖ్య ఆయిల్‌ఫెడ్‌కు దరఖాస్తు చేసుకుంది. బుధవారం ఆయిల్‌ఫెడ్ అధికారులు, రైతులు, సిబ్బందితో హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో అత్యధిక 19.42పైనే పాలసీ నిర్ధారించేందుకు అంగీకారం కుదిరింది. ఆయిల్‌ఫెడ్ ఆదాయంలో రైతుల వాటా 75.25 శాతం ఉండగా 14.61 శాతం పాలసీపై గెలల ధర చెల్లించాల్సి ఉంది. గతేడాది 14.42 ఉండగా ఈఏడాది 0.2శాతం పెరిగింది. దీంతో టన్ను గెలలకు గతేడాది కంటే రూ.200 అధికంగా చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. దీంట్లో తెలంగాణ ఆయిల్‌పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ తీవ్ర కృషి చేసిందని అధ్యక్ష కార్యదర్శులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, కోటగిరి సీతారామస్వామి ‘సాక్షి’కి తెలిపారు. అత్యధిక ఆయిల్ రికవరీని పాలసీ నిర్ధారణ కోసం కృషి చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సరీలలో మొక్కల నాణ్యత కోసం ఆయిల్‌ఫెడ్ పాటించే నియమాలను అన్ని నర్సరీలలో పాటించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్‌ఫాం సాగు విస్తరణకు ప్రస్తుత ధర దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ ఎండీ యాష్మిన్ బాషా, జాయింట్ డైరెక్టర్ సరోజిని, ఏడీహెచ్ లహరిలకు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఆలపాటి రామచంద్రప్రసాద్, కోటగిరి సీతారామస్వామి, బండి భాస్కర్, ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి, సీనియర్ మేనేజర్లు ఆకుల బాలకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment