నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోందని, నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే పాఠశాలల్లోనే బీజం పడాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. అన్నపురెడ్డిపల్లిలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్‌ను సోమవారం ఆయన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వాడకం వచ్చిందని, అధునాతన వైద్యం సైతం రోబోటిక్స్ ద్వారా చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం అన్ని రంగాలను సాంకేతికత శాసిస్తోందని తెలిపారు. ఎంపీ కోటా ద్వార కేంద్ర నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కేటాయిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే లక్ష్యంతోనే ఇక్కడ సైన్స్‌ఫేర్ ఏర్పాటు చేశామని తెలిపారు. తన జీవిత మూలాలు విద్యారంగం నుంచే ముడిపడి ఉన్నాయని, తన పదవీ కాలంలో విద్య, వైద్య రంగాలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారి స్వరూపారాణి, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఎస్‌ఓ చలపతిరాజు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఎస్.మాధవరావు, పాఠశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణమూర్తి, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంఈఓ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.
ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ
అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్‌కు వచ్చిన విద్యార్థులకు సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రెండు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఏర్పాట్లపై వారం రోజులుగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే సోమవారం రాత్రి విద్యార్థులకు దగ్గరుండి భోజనాలు వడ్డించారు.
అందుకు బీజం పాఠశాలల్లోనే పడాలి
దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో
దూసుకుపోతోంది..
జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ప్రారంభోత్సవ సభలో ఎంపీ రఘురాంరెడ్డి
ఎంతో ఉపయోగకరం
ఇక్కడ ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన మాకెంతో ఉపయుక్తం. సెనోటర కసియటోర (తగిరస) మొక్కల ఆకులను రసంగా చేసి విషసర్పాలు కాటు వేసిన చోట అద్దితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఇది శాసీ్త్రయంగా నిరూపితమైంది. ఈ ప్రయోగం ఈ ప్రదర్శన ద్వార వెలుగు చూస్తుందని ఆశిస్తున్నాం.
– బి.ఉదయచంద్రిక, టి.మౌనిక,
పూసుగూడెం(ములకలపల్లి)
రైతులకు ఉపకరిస్తుంది
ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్ మాకు ఉపయోగకరంగా ఉంది. సాంకేతికంగా మేము చేసిన లైఫ్ సేవర్‌స్టిక్ ప్రయో గం రైతులకు ఉపయోగపడుతుంది. ట్రిమ్మర్, పీవీసీ పైపు, స్విచ్, కనక్టర్, లైట్‌లో తయారు చేసిన లైఫ్ సేవర్‌స్టిక్‌లతో రాత్రి వేళల్లో రైతులు విషసర్పాల బారి నుంచి కాపాడుకోవచ్చు.
– ఎం సంతోష్‌కుమార్,
పి.నిరంజన్‌కుమార్, అన్నపురెడ్డిపల్లి
ఈ ప్రదర్శనలు స్ఫూర్తినిస్తాయి
ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. ప్రమాదాల నివారణ, విద్యుత్ ఆదా కోసం నేను చేసిన ప్రయోగం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. సెన్సార్ సహాయంతో చేసిన వీధిలైట్లు వాహనాలు, మనుషులు దారి వెంట వెళ్తున్నప్పుడు వాటంతట అవే వెలుగుతాయి. మళ్లీ అవే ఆరిపోవడంతో విద్యుత్ ఆదా అవుతుంది.
– బి సృజన, మల్లెలమడుగు (అశ్వాపురం)
ఫ్లోటింగ్‌హౌస్‌లు ప్రయోజనకరం
ఫ్లోటింగ్ హౌస్ నిర్మాణాలు ప్రయోజనకరం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. భూమి ఉపరితలానికి ఎత్తులో నిర్మించడం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చు. మా ప్రయోగం ఈ ప్రదర్శన ద్వారా వెలుగు చూడడం సంతోషంగా ఉంది.
– గుగులోత్ అర్చన
(టీజీఎంఆర్‌ఎస్, కొత్తగూడెం)
హైడ్రోపోనిక్
వ్యవసాయంపై ప్రయోగం
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి లేనందున హైడ్రోపోనిక్ వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులు పండించవచ్చు. ఈ పద్ధతి ద్వార తొలిసారి 1929లో ఇరాఖ్‌లో ప్రయోగం చేశారు. భారతదేశంలో కూడా 1946లో ప్రయోగాత్మకంగా చేశారు. ఈ పద్ధతి ద్వారా ట్రేల్లో వర్మికంపోస్టు నింపి నీటిని అందించి పంటలు సాగు చేయొచ్చు.
– కె.చరణ్, కె.రవితేజ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, దమ్మపేట)
మురుగునీరు శుద్ధి
మురికి నీటిని శుద్ధి చేసేందుకు మేం చేసిన ప్రయోగం ఈ వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా వెలుగుచూస్తుంది. కంకర, ఇసుక, బొగ్గును ఉపయోగించి మురికినీటిని శుద్ధి చేయొచ్చు. మళ్లీ ఆ నీటిని అవసరాలకు వాడుకోవచ్చు. ఇలాంటి ప్రదర్శనలు ఎక్కువ ఏర్పాటు చేయాలి.
– కె.కేశవసాయి, వై.ప్రతిమేష్ (భద్రాచలం)
Comments
Please login to add a commentAdd a comment