పామాయిల్ దిగుమతులపై తిరిగి సుంకం విధింపు
● కొత్తగా రవాణా చార్జీలు, అత్యధిక ఓఈఆర్‌తో ధర పెంపు ● భూమి పట్టాలతో సంబంధం లేకుండా సబ్సిడీపై మొక్కలు ● సంప్రదాయ సాగులో తగ్గిన లాభాలు, ఉద్యాన పంటలపై రైతుల ఫోకస్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గత నాలుగేళ్లుగా ఆశాజనకంగా లేని పామాయిల్ సాగు ప్రస్తుతం లాభాల ట్రాక్ ఎక్కుతోంది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలే ఇందుకు కారణం. దీంతో సంప్రదాయేతర పంటల సాగులో మరోసారి పామాయిల్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
వినియోగంలో 40 శాతం..
దేశవ్యాప్తంగా వంటలో ఉపయోగించే నూనెలో దాదాపు 40 శాతం పామాయిలే ఉంటోంది. ఇంతగా డిమాండ్ ఉన్నప్పటికీ దేశంలో పామాయిల్ సాగు తక్కువ. ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచే దిగుమతి అవుతోంది. అయితే స్థానికంగా ఉండే రైతులకు ఇబ్బంది రాకుండా దిగుమతులపై 49 శాతం సుంకాన్ని కేంద్రం విధించేది. కానీ 2022లో మొదలైన ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్ చైన్ దెబ్బతినగా పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఎత్తి వేసింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి పెరగడంతో స్థానిక ఉత్పత్తులకు ధర తగ్గి నాలుగేళ్లుగా పామాయిల్ రైతులకు లాభాలు పడిపోయాయి.
20 శాతం సుంకం విధిస్తూ..
విదేశాల నుంచి దిగుమతి అయ్యే పామాయిల్‌పై 20 శాతం సుంకం విధిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పామాయిల్ రేటు టన్నుకు సగటున రూ. 2 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. సుంకం విధించడానికి ముందు టన్ను పామాయిల్ గెలల ధర రూ.13,950 ఉండగా, ఇప్పుడు రూ.19,144కు పెరిగింది. దీంతో పాటు ఆయిల్ ఫ్యాక్టరీలో గెలల నుంచి వచ్చే ఆయిల్ పరిమాణం ఆధారంగా (ఓఈఆర్) చెల్లించే బోనస్‌ను పెంచుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. గతంలో సగటు ఓఈఆర్ ఆధారంగా బోనస్ చెల్లింపులు ఉండేవి. కానీ ఇందుకు విరుద్ధంగా గరిష్ట ఓఈఆర్‌ను పరిగణనలోకి తీసుకుని బోనస్ ఇవ్వాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో టన్ను గెలలపై అదనంగా రూ.2 వేల వరకు ఆయిల్‌పామ్ రైతులు లాభపడే అవకాశం కలిగింది. దీనికి తోడు తోట నుంచి ఆయిల్ ఫ్యాక్టరీ వరకు గెలల రవాణాకు సంబంధించి టన్నుకు రూ.190 అదనంగా చార్జీలు చెల్లించాలని ఈ ఏడాది నిర్ణయించారు. దీంతో ఈసారి ఆయిల్‌పామ్ రైతులు మంచి లాభాలు పొందే అవకాశం ఏర్పడింది.
ఇదే గరిష్టం కాదు..
గత నాలుగైదేళ్లతో పోల్చితే ప్రస్తుతం ఆయిల్‌పామ్ రైతులకు గరిష్ట లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో ఇంతకంటే అధిక లాభాలను ఆయిల్‌పామ్ రైతులు సాధించారు. దిగుమతి సుంకం 49 శాతంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న బోనస్‌లు, రవాణా చార్జీలు ఏమీ లేకుండానే ఆఫ్ సీజన్‌లో టన్నుకు గరిష్టంగా రూ.25,000 వరకు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుబడి ఖర్చులు పెరిగినందున ఇప్పుడు టన్ను గెలలకు రూ.20,000 వస్తేనే రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రస్తుతం తీసుకున్న సానుకూల నిర్ణయాలతోనే ఆగిపోకుండా ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించేలా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయిల్‌పామ్‌లో వ్యర్థాలుగా మిగిలే మట్టలను తిరిగి సాగులో (మల్చింగ్) ఉపయోగించుకునేలా చాప్ కటింగ్ యూనిట్లను జిల్లాలో స్థాపించాలనే డిమాండ్ ఉంది. గెలల కోత కూలీలకు ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కల్పించాలని రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. మొక్కలు నాటిన మొదటి మూడేళ్లలో ఉచిత ఎరువుల కోసం నగదు కాకుండా ఎరువులే సరఫరా చేయాలని అంటున్నారు.
మంచి ధర ఇవ్వడం ఆనందదాయకం
ఆయిల్‌పామ్ రైతులు అడిగినట్లుగా అత్యధిక ఓఈఆర్‌ను ప్రామాణికంగా తీసుకుని ధర నిర్ణయించడం ఆనందదాయకం. మా వినతికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ధర పెంచి రైతులకు శుభవార్త తెలిపింది. రైతులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని కోరుతున్నాం.
– ఆలపాటి రామచంద్రప్రసాద్, తెలంగాణ ఆయిల్‌పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
మంత్రి తుమ్మల కృషితో
రైతులకు మేలు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వతహాగా ఆయిల్‌పామ్ రైతు కావడంతో రైతుల కష్టాలు తెలుసు. అందుకే ఆయిల్‌పామ్ ధర పెంపునకు తీవ్రంగా కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దిగుమతి సుంకం పెంపునకు దోహదపడ్డారు. మేం అడిగిన వెంటనే ఆఫ్ సీజన్‌లో అశ్వారావుపేట నుంచి అప్పారావుపేటకు గెలల రవాణా చార్జీలు పెంపుదల చేయించారు.
– బండి భాస్కర్, రైతు సంఘం నాయకుడు
ఉద్యాన పంటలే మేలు..
తేమ శాతం పేరుతో ఈ ఏడాది జిల్లాలో పత్తికి సరైన ధర రాక ఆ పంట సాగు చేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మార్కెట్‌కు వెళ్లే బదులు చేల దగ్గర, ఇంటి వద్ద దళారులు, ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నారు. ఇక గతేడాది దాపురించిన నల్లి తెగులు మిర్చి రైతుల కంట కన్నీరు నింపింది. ఈ క్రమంలో సంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ సాగు పద్ధతులు, ఉద్యాన పంటల దిశగా రైతులు దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మునగ సాగుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చేపట్టింది. మరోవైపు ఏజెన్సీ మండలాల్లో భూమి పట్టాలతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న రైతులందరికీ సబ్సిడీపై ఆయిల్‌పాం మొక్కలు అందించేందుకు సర్కారు సిద్ధం అవుతోంది. అయితే కొత్త మొక్కలు అందించడం, సాగు విస్తీర్ణం పెంచడంలో సర్కారు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితుల మధ్య ఉన్న వత్యాసాన్ని తగ్గించడంపై జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment