పర్యాటక కేంద్రంగా రేగులగండి
● అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
మణుగూరు టౌన్: మండలంలోని కూనవరం పంచాయతీలోని రేగులగండిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం మణుగూరులో పర్యటించిన ఆయన తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత రేగులగండి చెరువు, చినరాయిగూడెం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రేగులగండి చెరువులో బోటింగ్, సైక్లింగ్ పడవలు ఏర్పాటు చేయాలని, పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పర్ణశాల నుంచి మణుగూరు, చినరాయిగూడెం వచ్చేందుకు పడవలు అందుబాటులో ఉంచితే సమయం, డబ్బు ఆదా అవుతాయని చెప్పారు. తద్వారా వ్యాపార అభివృద్ధికి సైతం అడుగులు పడే అవకాశం ఉంటుందన్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
పినపాక: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సంచులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు బోనస్ కల్పిస్తుందని, ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కొనుగోలులో అక్రమాలకు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రామకష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment