అదనపు కాంటా.. ఇదేమిటంటా?
●ధాన్యం తూకానికి అదనంగా 500గ్రా. కలుపుతున్న నిర్వాహకులు ●కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు తూట్లు ● రైతులపై భారం మోపుతున్న నిర్వాహకులు ●వారి నుంచే హమాలీ కూలీ వసూలు
దమ్మపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, అధిక బరువుతో కాంటా వేయిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో గిరిజన సహకార సంస్థ, కోఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సన్న రకం వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు, తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు భారీగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు కల్పించాల్సిన తాగునీరు, టార్పాలిన్ పట్టాలు వంటి కనీస సౌకర్యాలను కల్పించకుండా కొనుగోలు కేంద్రాల బాధ్యులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కాంటా వేసిన హామాలీల కూలీ రేట్లను కూడా రైతుల వద్దనే వసూలు చేస్తున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించే యంత్రం పనిచేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
500 గ్రాములు అదనంగా కాంటా..
మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం తూకంలో ఒక గన్నీ సంచికి 500 గ్రాములకు పైగా అదనంగా కాంటా వేయిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంటా వేసే గన్నీ సంచి బరువు 500 గ్రాములు ఉండగా, ఆ సంచిలో గరిష్టంగా 40 కేజీల వరకు ధాన్యం నింపవచ్చు. నిబంధనల ప్రకారం ఒక సంచి బరువు, దానిలో నింపిన 40 కేజీల ధాన్యంతో కలిపి మొత్తంగా 40 కేజీల 500 గ్రాములు మాత్రమే కాంటా వేయాల్సి ఉంది. కానీ, 41 కేజీల 50 గ్రాముల వరకు నిర్వాహకులు కాంటా వేయిస్తున్నారు. దీనిపై ప్రశ్నించగా.. నిర్వాహకుల నుంచి సరైన సమాధానం లభించలేదని రైతులు వాపోతున్నారు.
రైతులే కాపలా..
ధాన్యం కాంటా వేసిన తరువాత దానికి సంబంధించిన పూర్తి బాధ్యత కొనుగోలు కేంద్రాలే వహించాల్సి ఉంది. కానీ, అందుకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ధాన్యం అంతా లారీలో లోడ్ చేసే వరకు రైతులే కాపలా కాయాల్సి వస్తోందని అంటున్నారు. ఒక పెద్ద లారీకి సరిపడా ధాన్యం కాంటా అయ్యి, వాటిని లారీలో లోడ్ చేయాలంటే రెండు రోజులు పడుతుందని, అప్పటివరకు ధాన్యానికి తామే కాపలాగా ఉండాలంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మేనేజర్ స్పందన కరువు..
దీనిపై దమ్మపేట జీసీసీ మేనేజర్ పాపారావును వివరణ కోరడానికి ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment