భయం గుప్పెట్లో ఏజెన్సీ..
దుమ్ముగూడెం: వరుస ఎన్‌కౌంటర్లు, ఇన్‌ఫార్మర్ పేరుతో హత్యలు జరుగుతున్న నేపధ్యాన ఏజెన్సీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లలో వందల మంది మావోయిస్టులు మృతి చెందారు. సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమాన ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోలు పలువురిని హతమారుస్తుండగా.. భద్రాచలం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వాజేడులో గురువారం ఇద్దరు ఆదివాసీలను హత్య చేయడం సంచలనం సృష్టించింది.
పెరిగిన నిఘా..
మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉండడతో పాటు నిఘా వ్యవస్థను పటిష్టం చేశాయి. ఈక్రమాన మావోయిస్టులు తమ సంచారాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతున్నా పోలీస్ వ్యవస్థకు ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో పసిగడుతున్నారు. వైద్యం నిమిత్తం లేదా మరేదైనా పనుల కోసం తెలంగాణ వైపు వస్తున్న వారిని గుర్తిస్తున్నారు. రాష్ట్ర పోలీసుల పటిష్టమైన నిఘా వ్యవస్థతో అడవి నుంచి అడుగు తెలంగాణ వైపు పడితే కదలికలను ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకుంటుండడంతో మావోయిస్టులకు ఎటూ పాలుపోవడం లేదు. దీంతో తమ ఉనికిని తెలిపేందుకు ఇన్‌ఫార్మర్ల నెపంతో హత్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా అనవసర ఇబ్బందులు ఎందుకనుకునే వారు కొన్నాళ్లు పట్టణాలకు వెళ్లాలని సిద్ధమవుతుండగా, మరికొందరు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు.
వాజేడులో ఇద్దరి హత్యతో అడవిబిడ్డల్లో ఆందోళన
సరిహద్దు కావడంతో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. తెలంగాణలో మావోయిస్టులు అంతో ఇంతో ప్రభావం ఇక్కడే చూపుతున్నారు. చెదురుమదురు హింసాత్మక ఘటనలతో పాటు లేఖలు, వాల్ పోస్టర్ల ద్వారా ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఈ ఏడాది జిల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు జరగగా ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. పదుల సంఖ్యలో లొంగిపోయారు. మరింతమంది ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. ఈ సమయాన వాజేడులో ఇద్దరిని మావోలు హతమార్చాడంతో ఏజెన్సీ వాసుల్లో ఆందోళనను తీవ్రం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment