మావోల ఇలాఖాలో మరో పోలీసు క్యాంపు
చర్ల: మావోయిస్టుల అడ్డాలో పోలీసులు ఇంకో క్యాంపు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పువ్వర్తి, కొండపల్లి, తుమ్మలపాడు ప్రాంతాల్లో పోలీసు క్యాంపులను ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్ స్టేషన్ పరిధి జీడిపల్లి సమీపాన క్యాంపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. బీజాపూర్ జిల్లాకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలకు చెందిన సుమారు 800 మంది జవాన్లు అక్కడకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కూడా చర్ల మీదుగా బస్సులు, లారీల్లో వందలాది మంది జవాన్లను జీడీపల్లి సమీప అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు తరలించారు.
శతాధిక వృద్ధుడు మృతి
గుండాల: మేడారం సమ్మక్క భర్త ఆరెం వంశీయుడు పగిడిద్దరాజు (జాతర) ప్రధాన పూజారి, శతాధిక వృద్ధుడు శుక్రవారం మృతిచెందాడు. మండలంలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన ఆరెం బుచ్చయ్య (110) శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏటా పగిడిద్దరాజు జాతరను వేపలగడ్డ గ్రామంలో నిర్వహిస్తారు. ఈ జాతరకు మృతుడు ప్రధాన పూజారిగా పనిచేస్తున్నాడు.
బుల్లెట్ ఢీకొని వ్యక్తి...
పాల్వంచరూరల్: రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బుల్లెట్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాలోతు లచ్చు (40) శుక్రవారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా సారపాకవైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం (బుల్లెట్) ఢీకొట్టింది. దీంతో లచ్చు అక్కడికక్కడే మృతిచెందాడు. బుల్లెట్ నడుపుతున్న రెహమాన్‌ను స్థానికులు కొట్టారు. ఎస్‌ఐ సురేశ్‌ను వివరాలు కోరగా రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం అందిందని, ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు..
సుజాతనగర్: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన ఖమ్మం, కొత్తగూడెం ప్రధాన రహదారిపై నాయకులగూడెం వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమాదేవి కథనం ప్రకారం.. జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ, పెద్దతండా గ్రామానికి చెందిన లకావత్ నాగేశ్వరరావు (43) పని నిమిత్తం కొత్తగూడెం వెళ్లాడు. ఆయన భార్య నిర్మల ఇదే మండలంలోని లైన్‌తండాలో జరిగిన ఓ కార్యక్రమానికి హజరై భర్త కోసం సుజాతనగర్‌లో ఆగింది. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా నాయకులగూడెం గ్రామం వద్ద రాష్ట్రీయ రహదారిపై ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నిర్మలను కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment