● అసౌకర్యాలతో సతమతమవుతున్న ప్రస్తుత గురుకులాలు ● అద్దె భవనాలు, సిబ్బంది కొరతతో విద్యార్థుల అవస్థ ● ప్రభుత్వ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. అందులో చదివే విద్యార్థులు అవస్థలు పడుతూ విద్యనభ్యసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం రెండో విడతలో జిల్లాకు సమీకృత గురుకులం మంజూరు ప్రకటనతో అందరిలో ఆశలు చిగురించాయి. జిల్లాలో సమీకృత గురుకులం నిర్మాణం జరిగితే పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. డిజిటల్ విద్య, ఇంటర్నెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి సౌకర్యాలు విద్యార్థులకు అందుతాయి. జిల్లాకు గురుకులం మంజూరు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం, జిల్లాలోని ఏ నియోజకవర్గంలో నిర్మించే విషయమై స్పష్టత ఇవ్వలేదు. సమీకృత గురుకులం నిర్మాణానికి విశాలమైన భూమి, సౌకర్యాలపై జిల్లా అధికారులు, విద్యాధికారులు పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులలాన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు ప్రస్తుతం ఒక సమీకృత గురుకులం మంజూరు కాగా, భవిష్యత్‌లో నియోజకవర్గానికి ఒకటి మంజూరు చేయించాలనే ఆలోచన, ప్రయత్నంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికో సమీకృత గురుకులం ఏర్పాటైతే ఏజెన్సీ జిల్లాలో విద్య మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment