ఘనంగా పరమాచార్య ఆరాధన
భద్రాచలంటౌన్: పట్టణంలోని శుభం ఫంక్షన్‌హాల్‌లో శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠాధిశ్వరులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల ఆరాధన ఉత్సవాల్లో భాగంగా పరమాచార్య ఆరాధన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎల్.రమాదేవి సంస్కృత పండితులు ఎస్టీజీ శ్రీమన్నారాయణాచార్యులకి భద్రాద్రి విద్వత్ శేఖర బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. ముందుగా మహాస్వామి పాదుకలను సంతానప్రద ఆంజనేయ స్వామి ఆలయం నుంచి బ్రాహ్మణ రాజ వీధుల మీదుగా ఊరేగింపుగా శుభం ఫంక్షన్ హాల్ వరకు తీసుకువెళ్లి అక్కడ పాదుకార్చనతోపాటు వైదిక కార్యక్రమాలను కామకోటి శిష్యకోటి వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వీరయ్య, ప్రధాన అర్చకులు కోటి రామస్వరూపాచార్య, ఆలయ వేద పండితులు పాల్గొన్నారు.
రామయ్య సన్నిధిలో బిహార్ అధికారి
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని బిహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.విజయలక్ష్మి శుక్రవారం సందర్శించారు. ఆమెకు అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికి ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులు, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారిని విజయలక్ష్మి దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ భవానీ రామకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లింగాల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి తెలుగు రాష్ట్రాల స్థాయి భక్త సమ్మేళనం
హాజరు కానున్న రామకృష్ణమఠం బాధ్యులు
సత్తుపల్లిటౌన్: శ్రీరామకృష్ణ పరమహంస–స్వామి వివేకానంద భావప్రచార పరిషత్ ఆధ్వర్యాన శని, ఆదివారం సత్తుపల్లిలో తెలుగు రాష్ట్రాల స్థాయి భక్త సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లను కాషాయ తోరణాలతో అలంకరించడమే కాక జేవీఆర్ పార్క్ వద్ద స్వామి వివేకానంద కాంస్య విగ్రహానికి లైట్లు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంగణంలోనే నిర్మించిన స్వామి వివేకానంద హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఇన్‌స్టిట్యూట్ భవనంలో నిరుద్యోగ యువతకు వృత్తి విద్య నైపుణ్య కోర్సులు శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, తొలిరోజైన శనివారం స్థానిక మాధురి ఫంక్షన్ హాల్‌లో విద్యార్థి సమ్మేళనం జరగనుంది. ఇందులో హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానందజీ మహరాజ్‌తో పాటు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, విజయవాడ రామకృష్ణమిషన్ నిర్వాహకులు స్వామి శితికంఠానంద మహరాజ్, ఎస్పీ కేజీవీ.సరిత ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం జరిగే యువజన సమ్మేళనానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్‌బాబు, వందేమాతరం రవీందర్ హాజరవుతారు. అలాగే, ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్ నిర్వాహకులతో భక్త సమ్మేళనం నిర్వహించనున్నారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
సింగరేణి(కొత్తగూడెం): రోడ్డు ప్రమాదంలో ఇల్లెందుకు చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం కొత్తగూడెం టూటౌన్ పరిధిలోని సీఆర్‌పీ క్యాంప్ వద్ద చోటుచేసుకుంది. ఇల్లెందుకు చెందిన జమీల్‌పాషా (15) పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం రామవరంలోని ఎస్సీబీనగర్‌లో నివాసముంటున్న తన పెద్దమ్మ ఇంటికి జమీల్‌పాషా వచ్చాడు. రా మవరంలో షాపింగ్ చేసుకొని తన సోదరుడితో ఎస్సీబీనగర్‌కు బైక్‌పై వస్తున్న క్రమంలో సీఆర్‌పీ క్యాంప్ వద్ద బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే జమీల్‌పాషా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి అబ్దుల్ ఖాదర్ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment