ఉత్కంఠగా వాలీబాల్ టోర్నీ
● బాలబాలికల విభాగాల్లో వరంగల్, ఖమ్మం జట్ల ముందంజ ● నేడు ముగియనున్న రాష్ట్రస్థాయి పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీఎం కప్ వాలీబాల్ టోర్నీలో భాగంగా పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు శనివారం రెండో రోజుకు చేరగా, పాత పది జిల్లాల నుంచి హాజరైన బాలబాలికల జట్లు లీగ్ దశలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బాలబాలికల విభాగాల్లో వరంగల్, ఖమ్మంతో పాటు నల్లగొండ, నిజామాబాద్ జట్లు ముందంజలో నిలిచాయి. మ్యాచ్‌లను ఖమ్మం డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించగా కోచ్ ఎం.డీ.అక్బర్ అలీ, ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శులు కె.నర్సింహమూర్తి, వి.నరేష్, రిఫరీలు ఐ.పవన్‌కుమార్, భద్రం, షఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు మ్యాచ్‌ల ఫలితాలు...
బాలుర విభాగం లీగ్ మ్యాచ్‌లో పూల్ ‘ఏ’ నుంచి ఖమ్మం – ఆదిలాబాల్ జట్లు తలపడగా ఖమ్మం జట్టు 25–23, 25–16, 25–23 వరుస సెట్లతో విజయం సాధించింది. అనంతరం మెదక్ – నల్లగొండ మ్యాచ్‌లో మెదక్, వరంగల్–మెదక్ నడుమ మ్యాచ్‌లో వరంగల్ జట్టు గెలిచింది. పూల్ ‘బీ’కి వచ్చేసరికి మహబూబ్‌నగర్ – నిజామాబాద్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్, కరీంనగర్ – హైదరాబాద్ మధ్య మ్యాచ్‌లో కరీంనగర్, రంగారెడ్డి – హైదరాబాద్ జట్ల నడుమ మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఇక బాలికల విభాగం పూల్ ‘ఏ’లో నల్లగొండ–హైదరాబాద్ మ్యాచ్‌లో నల్లగొండ, ఖమ్మం–రంగారెడ్డి మధ్య మ్యాచ్‌లో ఖమ్మం, నిజామాబాద్ – రంగారెడ్డి నడుమ పోటీలో నిజామాబాద్ గెలిచింది. పూల్ ‘బీ’లో ఆదిలాబాద్ జట్టుపై వరంగల్, మెదక్ జట్టుపై మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించాయి. కాగా, ఆదివారం రాష్ట్ర స్థాయి టోర్నీ ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment