రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున అంతరాలయంలోని మూలముర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని పల్లకీ సేవగా బేడా మండపంలో కొలువు దీర్చారు. స్వామివారికి ఆలయ అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణతో నిత్యకల్యాణ క్రతువును కనుల పండువగా జరిపారు.
వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలి
● డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్
కొత్తగూడెంరూరల్ : లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్‌ఓ ఎల్.భాస్కర్‌నాయక్ సందర్శించారు. ఆస్పత్రిలోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యసిబ్బందితో మాట్లాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. నిక్షయ శివిర్ కార్యక్రమంలో భాగంగా అనుమానితులకు క్షయ పరీక్షలు నిర్వహించాలని, సికిల్ సెల్ ఎనీమియా కార్డుల పంపిణీ వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. వైద్యాధికారి డాక్టర్ హరీష్, ఎం.వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ రామచందు, సిబ్బంది పాల్గొన్నారు.
టేకులపల్లి కళాకారుడికి అవార్డు
టేకులపల్లి: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ గాన కోకిల అవార్డులను ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 50 మందిని ఎంపిక చేసి, అవార్డులు అందించగా, వారిలో టేకులపల్లికి చెందిన బొమ్మెర జగన్మోహన్ ఉన్నారు. ప్రజా కళాకారుడిగా పేరున్న జగన్ పదేళ్లపాటు ధూంధాం బృందంలో పని చేశాడు. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా శనివారం జగన్మోహన్‌ను పలువురు అభినందించారు.
పోస్టల్ సేవలపై అవగాహన కల్పించాలి
పాల్వంచ: పోస్టల్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ (ఎస్‌పీ) వి.వీరభద్ర స్వామి అన్నారు. శనివారం స్థానిక పోస్టాఫీస్‌లో నిర్వహించిన సబ్ డివిజన్ పరిధిలోని గ్రామీణ తపాల ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్‌శాఖ ద్వారా అమలు చేస్తున్న తక్కువ ప్రీమియంతో అందే జీవిత బీమా పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పాల్వంచ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఎం.వీరన్న, ఐపీపీబీ మేనేజర్ సంజయ్, ఓవర్సీస్ దుర్గా ప్రసాద్ పాల్వం సబ్ పోస్ట్ మాస్టర్ నాగ మణిషా, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ బండి ఎల్లారావు, తిలక్, రామారావు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment