నిరుపేద బాలిక... ఎంబీబీఎస్
వైరా: వైరా మున్సిపాలిటీలో 15వ వార్డుకు చెందిన కొనకంచి జోజి – ప్రకాశమ్మ దంపతుల కుమార్తె మృతి చెందింది. దీంతో ఆమె కుమార్తె పానెం శ్రీహర్షిత అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. నీట్‌లో మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా కనీస ఫీజు కట్టలేని దైన్యస్థితి ఎదుర్కొంటుండగా ‘చదువుల తల్లిని కనికరించని లక్ష్మీదేవి’ శీర్షికన అక్టోబర్ 3న ‘సాఽక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఆమెకు అండగా నిలిచేందుకు దాతలు వెల్లువెత్తారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ తన స్నేహితులతో కలిసి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. వైరా ఎస్‌బీఐ మేనేజర్ వెంకటరెడ్డి బాలికకు పూచీకత్తు లేకుండా ఐదేళ్లు అవసరమైన రుణాన్ని అందజేస్తానని హామీపత్రం ఇచ్చారు. ఇలా బాలిక బ్యాంకు ఖాతాలో దాతలు రూ.4,38,432 జమ చేయగా, నేరుగా రూ.2,05,500 మేర శ్రీహర్షితకు నగదు అందింది. దీంతో ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ విషయమై శ్రీహర్షిత తాత కొనకంచి జోజి మాట్లాడుతూ ‘సాక్షి’ చలువతోనే తన మనవరాలు డాక్టర్ కోర్సు చదువుతోందని సంతోషంగా వెల్లడించాడు. సాక్షి పత్రిక కృషి మరువలేనిదని, యాజమాన్యానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment