భద్రాద్రికి ప్రపంచస్థాయి కీర్తి..
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాచలంటౌన్: భద్రాద్రి పేరు ప్రపంచస్థాయిలో మార్మోగేలా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. గోదావరి కరకట్ట ప్రదేశాల పక్కన టూరిజం స్పాట్‌గా నిర్మిస్తున్న రివర్ సైడ్ క్యాంపెయినింగ్, గిరిజన కల్చర్ స్టాల్స్ ఏర్పాట్ల నిర్మాణ పనులను భద్రాచలం, చింతూరు ఐటీడీఏ పీఓలు బి.రాహుల్, అపూర్వతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు భద్రాచలం వచ్చే భక్తులకు తెలిసేలా ఏజెన్సీని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో జరిగే సీతారామచంద్రస్వామి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలను పురస్కరించుకుని కరకట్ట వద్ద రివర్ ఫెస్టివల్ తరహాలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గిరిజనుల సంప్రదాయ ఇళ్లు, నృత్యాలు, వంటకాలు, వెదురు ఉత్పత్తులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశామన్నారు. తేనె, తాటి బెల్లం, రాగి జావ, జొన్న జావ వివిధ రకాల న్యూట్రిషన్ ఆహార పదార్థాలతో 40 స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటిలో పేపర్ ప్యాకింగ్ మాత్రమే వాడాలని, వచ్చే నెల 8 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రివర్ ఫెస్టివల్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మార్చి వరకు కొనసాగిస్తామని, మళ్లీ నవంబర్ నుంచి ప్రారంభించి ఆరు నెలలపాటు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ రావు, మత్స్య శాఖ ఏడీ ఇంతియాజ్ అహ్మద్, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ వెంకటేశ్వరరావు, ఏసీఎం ఓ.రమణయ్య, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరాస్వామి, గ్రామపంచాయతీ ఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment