ప్రజావాణికి పోటెత్తారు..
● ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ ● సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో తమ సమస్యలపై పలువురు అందించిన వినతిపత్రాలను పరిశీలించాలని, తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి సమస్యలపై వినతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమయపాలన పాటించని విద్యుత్‌శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం నుంచి సకాలంలో హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏఓను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కలెక్టర్ పాటిల్ దరఖాస్తులు స్వీకరించి, సంబంఽధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలిలా..
●కొత్తగూడెం హనుమాన్ బస్తీకి చెందిన రాజుల సరోజిని తన భర్త ఇటీవల గుండెనొప్పితో మరణించాడని, ఇంటి అద్దె చెల్లించలేక పోతున్నామని, ఇందిరమ్మ ఇంటితో పాటు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందించగా హౌసింగ్ శాఖకు ఎండార్స్ చేశారు.
●మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో పశువులు విచ్చలవిడిగా రోడ్లపైన, పొలాల్లో తిరుగుతున్నాయని, పంటలను నాశనం చేస్తున్నాయని, రహదారుల వెంట వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బందెలదొడ్డి నిర్వహణ చేపట్టాలని స్థానికులు ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు.
●పాల్వంచలోని శ్రీనివాస బంజారా కాలనీలో తాము 13 ఏళ్లుగా నివసిస్తున్నామని, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో తమకు విద్యుత్ మీటర్లు లేవని, కొత్తగా మీటర్లు వచ్చాయని, గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని పలువురు దరఖాస్తు చేయగా విద్యుత్ ఎస్‌ఈకి ఎండార్స్ చేశారు.
●తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అప్పగించాలని కోరుతూ రామవరంలోని 9వ వార్డు కౌన్సిలర్ మోరె రూప ఆధ్వర్యంలో లబ్ధిదారులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment