పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, అర్చకులు వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన
కొత్తగూడెంరూరల్ : జిల్లాలో పది రోజులపాటు ఎయిడ్స్ నిర్మూలనపై అవగహన కల్పించేందుకు ప్రచార మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ నాయక్ కలెక్టరేట్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ జిల్లాలో పది రోజులపాటు అవగాహన కల్పించడతోపాటు ఎయిడ్స్ పరీక్షలు చేస్తారని తెలిపారు.
ఆరోగ్యంపై అశ్రద్ధ
వహించొద్దు
సీసీఎఫ్ భీమా నాయక్
చుంచుపల్లి: అడవుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న అటవీ శాఖ సిబ్బంది ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దని సీసీఎఫ్ భీమా నాయక్ అన్నారు. గురువారం కొత్తగూడెం డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో సింగరేణి సంస్థ సహకారంతో అటవీ శాఖ సిబ్బందికి మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ మాట్లాడుతూ సిబ్బంది శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మూడు, ఆరు నెలలకోసారి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం సింగరేణి సీఎంఓ సుజాత మాట్లాడుతూ సమాజసేవ కార్యక్రమాల్లో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు ఫిజికల్ ఫిట్నెస్‌ను పాటించాలని సూచించారు. శిబిరంలో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్, కొత్తగూడెం ఎఫ్‌డీఓ యు.కోటేశ్వరరావు, అధికారులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సింగరేణి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మే వరకు సింగరేణిలో బదిలీలు రద్దు
సింగరేణి(కొత్తగూడెం): 2024–25 ఆర్థిక సంవత్సరంలో జనవరి 1 నుంచి మే 31వ తేదీ వరకు సింగరేణిలో బదిలీలు, డిప్యూటేషన్లను రద్దు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులుగా సంస్థ నిర్దేశించుకుంది. గత డిసెంబర్ 29 వరకు 46.30 మిలియన్ టన్నులు మాత్రమే వెలికితీసింది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలి ఉన్న మూడు నెలల్లో ఇంకా 25.70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ బదిలీలు, మ్యూచ్‌వల్ బదిలీలు, డిప్యూటేషన్లను రద్దు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. కాగా సింగరేణిలో ప్రొడక్షన్ మంత్స్ మూడు మాసాలైతే ఐదు నెలలవరకు బదిలీలు నిలిపివేయటం సరికాదని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. లోప భూయిష్టమైన తాజా సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు.
నేడు మహిళా
ఉపాధ్యాయులకు సన్మానం
కొత్తగూడెంఅర్బన్: సావిత్రీ బాయి పూలే జయంతి(మహిళా ఉపాధ్యాయ దినోత్సవం)ని పురస్కరించుకుని ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేయనున్న మహిళా ఉపాధ్యాయులను సన్మానించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు ఉద్యోగ విరమణ పొందనున్న మహిళా ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం శుక్రవారం కొత్తగూడెంలోని ఆనంద ఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరపనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment