దమ్మపేట: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మినీ ట్రక్కును మండలంలోని వడ్లగూడెం శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఓ వాహనంలో రేషన్ బియ్యాన్ని మండలంలోని వడ్లగూడెం శివారు నుంచి ఏపీలోని గుంటూరు ప్రాంతానికి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌ఐ శుక్రవారం తెల్లవారుజామున నిఘాపెట్టి వాహనాన్ని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యం 20 క్వింటాళ్లు ఉండగా, వాటి విలువ రూ.40,000 ఉంటుందని తెలిపారు. వాహనంలోని ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.
పశువులు తరలిస్తున్న ఇద్దరిపై...
ఇల్లెందు: జిల్లాలోని మోరంపల్లి బంజర నుంచి హైదరాబాద్‌కు 14 పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని ఇల్లెందు బొజ్జాయిగూడెం వద్ద పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. పశువులను తరలించేందుకు ఎలాంటి పత్రాలు లేనందున పశువుల వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సీఐ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై...
ఇల్లెందు: పట్టణంలోని ఓ బార్ షాపులో మద్యం సేవించి అక్కడి కౌంటర్‌పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఉమామహేశ్, సందీప్, రియాజ్ గురువారం రాత్రి బార్‌లో దాడి చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు సీఐ బత్తుల సత్యనారాయణ శుక్రవారం కేసు నమోదు చేశారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై..
పాల్వంచ: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నిర్వాహకుడిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని యారో ఏజెన్సీ నిర్వాహకుడు తాళ్లూరి హరిబాబు డబ్బులు వసూలు చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నాడని సోషల్ మీడియాలో కొత్తగూడెంనకు చెందిన కోట శివశంకర్ తప్పుడు ప్రచారం చేస్తుండటంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటతో యారో ఏజెన్సీ నిర్వాహకుడు హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ రాఘవయ్య శివశంకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment