ఇల్లెందు : క్రయ విక్రయాలకు అనుమతి ఉన్న ఓ వ్యాపారి దర్జాగా మార్కెట్ అధికారులనే బురిడీ కొట్టించారు. ఆ వ్యాపారీ తతంగం గమనించిన మార్కెట్ అధికారులు ఖంగు తినాల్సి వచ్చింది.. ఇల్లెందు మండలం ముకుందాపురం ఏరియాకు చెందిన ఓ వ్యాపారికి క్రయవిక్రయాల అనుమతి ఉంది. దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఎరువులు పురుగు మందులు విత్తనాలు విక్రయిస్తారు. రైతులకు పెట్టుబడి పెడతారు. వారి నుంచి పండిన పంటంతా లాగేసుకుంటారు. కానీ ఆ పంటను మాత్రం మార్కెట్ రిజిస్టర్లలో నమోదు చేయకుండా మాయం చేస్తున్నారు. మార్కెట్ ఫీజు ఎగనామం పెట్టాలనే దురాశతో దర్జాగా జీరో వ్యాపారం చేస్తున్నారు. కొద్దిపాటి వ్యాపారం రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. దానికి తగినంత ఫీజు కూడా మార్కెట్‌కు చెల్లించడం లేదు. అయితే అకస్మాత్తుగా మార్కెట్ అధికారులు ఆ షాప్‌ను తనిఖీ చేశారు. మార్కెట్ రిజిస్టర్లలో నమోదు చేసిన పంటకు తన వద్ద దాచుకున్న రహస్య ఖాతా పుస్తకాలకు చాలా తేడా ఉన్నట్లు గుర్తించి ఆ రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తిస్థాయి పరిశీలన చేసి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. జరిగిన తతంగాన్ని అటు జిల్లా ఉన్నతాధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు మార్కెట్ చైర్మన్, పాలక వర్గం దృష్టికి తీసుకుని వెళ్లి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయమై మార్కెట్ సెక్రటరీ నరేష్‌ను వివరణ కోరగా.. పరిశీలన చేస్తున్నామని, త్వరలో ప్రజల ముందు ఉంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment